MohanPublications Print Books Online store clik Here Devullu.com

మహాకాళి బోనాల వేడుక, Mahamkali Bonala Veduka

మహాకాళి బోనాల వేడుక
Mahamkali Bonala Veduka
మహాకాళి బోనాల వేడుక
అఖిల ప్రకృతి- శక్తి సమన్వితం. దైవారాధనలో భాగంగా ప్రకృతిని, శక్తిని పూజించడం అనాదిగా కొనసాగుతోంది. సమాజానికి, వ్యక్తులకు జ్ఞానం, సంపద, శక్తి అవసరమవుతాయి. ఈ మూడింటినీ ఏకీకృతంగా ప్రసాదించే మూల బ్రహ్మాత్మిక- ప్రకృతి శక్తి. సృష్టి, స్థితి, లయ కారకమైన మాతృ స్వరూపాన్ని వివిధ రీతుల్లో ఆరాధించే సంప్రదాయాలు ఉన్నాయి. ప్రకృతి ఆకృతులైన జగన్మాత రూపాల ఆరాధనకు ఆషాఢ మాసం తగిన తరుణం. బోనాల నేపథ్యంలో- మంత్రతంత్రాలకు అతీతంగా జానపదులు, గ్రామీణులు నిర్మల భక్తితో అమ్మను కొలిచే పద్ధతి ఆషాఢంలోనే ఆవిష్కారమవుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లో బోనాల సంబరం ఉత్సాహభరితంగా సాగుతుంది. సికింద్రాబాద్‌లో నెలకొన్న ఉజ్జయినీ మహాకాళి జాతరతో ఈ ఉత్సవం పతాక స్థాయికి చేరుకుంటుంది. భాగ్యనగరంలో బోనాల సందడికి, ఉజ్జయినీ మహాకాళి సన్నిధికి ప్రత్యేక సంబంధం ఉంది. సురిటి అప్పయ్య అనే భక్తుడు 1815వ సంవత్సరంలో సికింద్రాబాద్‌లో అమ్మవారి కొయ్య విగ్రహాన్ని నిర్మింపజేశారు. ఉజ్జయినిలో సైన్యంలో బాధ్యతలు నిర్వహించిన ఆయన, 1864లో ఇదే ఆలయంలో అమ్మవారి శిలావిగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేశారంటారు. ఈ శిలావిగ్రహం, ఇదే ఆలయ ప్రాంగణంలోని బావిలో లభ్యమైంది.
ఆలయ జీర్ణోద్ధరణ సందర్భంలో మహా మాణిక్యాల దేవి విగ్రహమూ లభించిందని చెబుతారు. ప్రస్తుతం ఈ సన్నిధిలో మహాకాళి, మాణిక్యాల దేవి మూర్తులు దర్శనమిస్తాయి. భక్తులు ఏటా ఆషాఢంలో అమ్మకు బోనాలు సమర్పిస్తూ ఘనంగా జాతర నిర్వహిస్తున్నారు.
సికింద్రాబాద్‌ మహాకాళి ఆషాఢ జాతర ‘ఘటోత్సవం’గా వ్యవహరించే ‘ఎదుర్కోలు’తో ప్రారంభమవుతుంది. ఘటంలోకి అమ్మవారిని ఆవాహన చేస్తారు. ఘటాన్ని వూరేగిస్తారు. ఘటోత్సవం తరవాత, అమ్మవారికి ప్రియమైన బోనాలు (భోజనాలు) సమర్పిస్తారు. పసుపు, కుంకుమలు అలంకరించిన ప్రత్యేకమైన పాత్రలో అన్నపదార్థాల్ని నింపుకొని ఆలయానికి తరలివస్తారు. శాకబెట్టుట, పాకమిచ్చుట అనేవి ఈ ఉత్సవంలో ముఖ్యమైనవి. ‘శాకబెట్టుట’ అంటే వేప కొమ్మను పసుపు నీటిలో ఉంచి, అమ్మవారికి ఆ వేప శాఖ ఉన్న నీటిని సమర్పణ చేయడం. ‘పాకమిచ్చుట’ అంటే- బెల్లంతో తయారుచేసిన తీయని అన్న పదార్థాల్ని అమ్మకు నివేదన చేయడం.
మహాకాళికి సమర్పించే ఫలహారాల్ని వాహనాలపై తీసుకొచ్చే వేడుకే- ‘ఫలహారపు బండ్లు’. సొరకాయ, గుమ్మడికాయలతో దృష్టిదోషాన్ని తొలగించే ‘గావుపట్టు’, భవిష్యవాణిని వివరించే ‘రంగం’ వేడుక ఈ జాతరలో ప్రధాన భూమిక పోషిస్తాయి. విలక్షణ వేషధారణలతో పోతరాజులు- వాయిద్యాలకు అనుగుణంగా నృత్యాలు చేసే విధానం మరో ఆకర్షణ. ‘సాగనంపు’ ఘట్టం ద్వారా అమ్మవారిని తిరిగి ఆమె నెలవుకు పంపుతారు. అంతటితో, ఆషాఢ బోనాలు పరిసమాప్తమవుతాయి.
‘కాకతి’ దేవతను ఇలవేల్పుగా కొలిచిన కాకతీయులు ఆషాఢ ఉత్సవాల్ని నిర్వహించేవారు. గోల్కొండ నవాబుల కాలంలోనూ ఈ ఆషాఢ బోనాల సంప్రదాయం కొనసాగింది. ఇది నేటికీ అవిచ్ఛిన్నంగా పరిఢవిల్లుతోంది.
ప్రకృతి ద్వారా లభించిన అన్నం లేదా భోజనాన్ని భక్తిపూర్వకంగా అమ్మ స్వరూపాలకు నివేదిస్తారు. భోజనానికి రూపాంతరాలే- భోగం, బోనం. ‘నీ దయ వల్లే మేం అన్నపానీయాల్ని స్వీకరిస్తూ, సుభిక్షంగా ఆరోగ్యంగా ఉన్నాం. ఎప్పుడూ ఇలాగే మమ్మల్ని అనుగ్రహించు తల్లీ!’ అని భక్తులు మాతృశక్తి పట్ల కృతజ్ఞత వ్యక్తీకరించడమే బోనాల సమర్పణలోని ఆంతర్యం.
గోల్కొండ జగదాంబికా ఆలయంలో ప్రారంభమయ్యే బోనాల సంరంభం, సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాకాళి బోనాల సంబరంతో అంబరాన్ని తాకుతుంది. లాల్‌దర్వాజా సింహవాహిని బోనాల ఉత్సవంతో సుసంపన్నమవుతుంది. కలశ వాహనం (సృష్టి), వూరేగింపు (స్థితి), సాగనంపు (లయం) వంటి ప్రక్రియల ద్వారా- ఈ బోనాల ఘట్టంలో జగన్మాత శక్తితత్వం ప్రతిఫలిస్తుంది!
- డాక్టర్‌ కావూరి రాజేశ్‌పటేల్‌


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం