MohanPublications Print Books Online store clik Here Devullu.com

అమృతత్వ స్థితి, Amrutha Sthiti

అమృతత్వ స్థితి
 Amrutha Sthiti

+++++++++++అమృతత్వ స్థితి ++++++++
‘లోకంలో అన్నింటికన్నా ఆశ్చర్యకరమైంది ఏది?’ అని యక్షుడు అడిగిన ప్రశ్నకు ధర్మరాజు బదులిస్తూ- మానవ స్వభావ అంశాన్ని ప్రస్తావిస్తాడు. ‘తన కంటి ముందే ఇంతమంది చనిపోతుంటే చూస్తూ కూడా, తాను శాశ్వతంగా ఉంటానని మనిషి అనుకుంటాడు...చాలా ఆశ్చర్యం!’ అంటాడు ధర్మజుడు.
అలా అనుకోవడం ఒక్కటే కాదు, అది నిజం కావాలని మనిషి నిరంతరం ప్రయత్నిస్తున్నాడు. వాటిని రెండు కోణాల నుంచి అర్థం చేసుకోవచ్చు. పుట్టిన దరిమిలా చావు అన్నదే లేకుండా జీవించడం మొదటి కోణం...అంటే మృత్యువునే జయించాలని అనుకోవడం! మహాభారతంలో ఉదంకోపాఖ్యానాన్ని గాని, భాగవతంలో క్షీరసాగర మథనాన్ని గాని ‘మరణాన్ని నివారించాలన్న తపనకు ప్రతీకలు’గా భావించవచ్చు.
రెండో కోణం- పుట్టుకే లేని స్థితిని పొంది, మృత్యువును దరికి రాకుండా చేసుకోవాలన్న మనిషి దూరాలోచన! పుట్టుక లేకుండా పోతే, మృత్యువు ప్రసక్తే రాదన్నది ఆంతర్యం. వయసు పడమటికి వాలేసరికి మృత్యుంజయ, ఆయుష్‌ హోమాల నిర్వహణగాని, ఉగ్రరథ భీమరథ శాంతికర్మలుగాని మొదలుపెట్టి- ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న ఇటీవలి జన్యు పరిశోధనల వరకు ఈ కోణం నుంచి అర్థం చేసుకోవాల్సిన విషయాలే! ఇవన్నీ చావును వాయిదా వేయాలన్న ప్రయత్నాల్లో భాగాలు.
మృత్యువును జయించాలన్న మనిషి ప్రయత్నానికి తొలి విజయం- ‘మృత సంజీవనీ విద్య’ రూపంలో లభించింది. దీనికి ఆద్యుడు రాక్షస గురువు శుక్రాచార్యుడు. దేవ దానవ సంగ్రామాల్లో రాక్షసులు పెద్దయెత్తున మరణించడాన్ని గమనించి, విరుగుడుగా మృతసంజీవనీ విద్యను సాధించాడు. అది దేవతల్లో కలవరం పుట్టించింది. ఆ మహావిద్యను అభ్యసించాలంటూ కచుణ్ని శుక్రాచార్యుడికి శిష్యుడిగా పంపించారు. చనిపోయినవారిని లేపి కూర్చోబెట్టే విశేష మంత్రం- ఆ రకంగా చేతికి దక్కిందన్నది ఈ కథ సారాంశం.
ఈ విద్యకు కొన్ని పరిమితులున్నాయి. యుద్ధాల్లో మరణించినవారికి మాత్రమే దీన్ని అనువర్తింపజేయగలం తప్ప, అవసానదశలో మరణిస్తే ఈ విద్య అక్కరకు రాదు. ఇది ముసలితనాన్ని గాని, రోగాల్ని గాని నివారించలేదు. మరణించిన దేహం శిథిలం కాకుండా ఆపలేదు. ఈ వివరాలన్నింటినీ మహాభారతమే తెలియజెప్పింది. మనిషి ముఖ్యంగా కోరుకునేది- ముదిమి చేరకుండా ఉండాలని! అది మృతసంజీవనితో సాధ్యం కాలేదు. అంటే, అది మనిషికి పాక్షిక విజయమే!
కాలక్రమంలో మానవుడికి ‘జన్మరాహిత్య స్థితి’ దిశగా ఆలోచన మళ్లింది. అసలు పుట్టుకే లేకుండా చేసుకోవాలన్న వూహ పుట్టింది. దీన్ని ‘మోక్షం’ అన్నారు. అంటే, జన్మపరంపరల నుంచి జీవి విముక్తుడై, తిరిగి పుట్టుకే లేకుండా చేసుకోవడం! దీనికి సంబంధించిన ప్రయత్నాలన్నీ మానవజన్మలోనే పూర్తిచేయాల్సి ఉంది. అందుకే మానవజన్మను ‘దుర్లభం’గా వర్ణించారు శంకరులు. ఒక వరంలా లభించిన మానవ జన్మను సద్వినియోగం చేసుకోవడం ద్వారా, మనిషి సద్గతులు సాధించాలన్నదే ఆయన సూచన.
దేహం మరణావస్థను చేరుకొనేలోగా, ఆ దేహం సాయంతోనే మనం ముక్తస్థితి పొందాలి. అదే జీవిత పరమార్థం. బొందితో స్వర్గనరకాలను దర్శించినా, ధర్మజుడు ఆకాశగంగలో స్నానించి ఆత్మస్థితి పొందిన తరవాత గాని, మహాప్రస్థానం పూర్తికాలేదు.
ఈ కథ ద్వారా- శరీరం అశాశ్వతమని, ఆత్మ నిత్యమని, ఆత్మస్థితితోనే మోక్షం సాధ్యమని మనిషి గ్రహించాడు. మృత్యువనేది దేహానికి చెందిందన్న సత్యం అతడికి తెలిసిపోయింది. మృత్యువును జయించే దిశగా ఇది గొప్ప ముందడుగు. మృత్యుభీతిని పోగొట్టేందుకు ఇదే తోడ్పడింది. మృత్యువును జయించడమంటే- మృత్యుభీతిని జయించడమే! మరణ భయం అంతరించిన తరవాత, ఆత్మజ్ఞానం దిశగా మనిషి ప్రయత్నం కొనసాగింది. అమృతత్వ స్థితికి అదే ఆఖరిమెట్టు అని పెద్దలు వర్ణించారు!
ఎందుకు పుట్టాం, ఏం చెయ్యాలి, దేని కోసం చెయ్యాలి?- అనే ప్రశ్నలు ఎదురైనప్పుడు ఈ క్రమపరిణామమూ అర్థమైతే, మనకు చక్కని జవాబు దొరికినట్లవుతుంది!
- ఎర్రాప్రగడ రామకృష్ణ

మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---






No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list