MohanPublications Print Books Online store clik Here Devullu.com

నర్మదానది జన్మస్థలి అమర్‌కంఠక్‌, River Narmadha born in Amrkantak

నర్మదానది జన్మస్థలి  అమర్‌కంఠక్‌
River Narmadha born in Amrkantak

++++++++నర్మదానది జన్మస్థలి
అమర్‌కంఠక్‌..! +++++++
వింధ్య, సాత్పురా పర్వత శ్రేణుల్లోని మైకాల్‌ పర్వతాల్లో ఉన్న సుందర పుణ్య క్షేత్రమే అమర్‌కంఠక్‌... నర్మదానది జన్మస్థలి. కొండలూ అడవులూ పుణ్యతీర్థాలూ జలపాతాలతో కూడిన సుందరప్రదేశం. సహజ వనమూలికలకు పెట్టింది పేరు’ అంటూ అక్కడి విశేషాలు చెప్పుకొస్తున్నారు విజయనగరానికి చెందిన మైలవరం భట్ల రామమోహన్‌.
సముద్రమట్టానికి సుమారు వెయ్యి మీటర్ల ఎత్తులో ఉన్న దీన్ని రిక్షా పర్వత్‌ అనీ పిలిచేవారట. నర్మద, జోహిలా(జ్వాలావంతి), సోనె నదులకు ఈ పర్వతశ్రేణులే పుట్టిల్లు. ఎవరైనా అక్కడ అడుగుపెడితే ముక్తిని పొందుతారనీ ఇది ముప్ఫైవేల కోట్ల సంవత్సరాలనాటి పుణ్యక్షేత్రమనీ పద్మపురాణం పేర్కొంటోంది. గంగలో ఒక మునక వేసినా, యమునాతీరంలో ఏడురోజులు ప్రార్థించినా, సరస్వతీ నది దగ్గర మూడురోజుల పూజలు చేసినా దొరకని పుణ్యం ఒక్కసారి నర్మదా నదిని చూస్తేనే దక్కుతుందని చెబుతారు. భక్తుల పాపకర్మలతో నిండిపోయిన గంగామాత ఏడాదికి ఒకసారి నలుపురంగు స్త్రీ రూపంతో నర్మదానదికి వచ్చి అందులో మునిగి శుద్ధి పొందుతుందనీ అంటారు. గంగానది కన్నా కోటీ యాభై సంవత్సరాల పూర్వమే నర్మదానది పుట్టిందనీ అందుకే నదులన్నింటిలోకీ ఇది పవిత్రమైనదనీ చెబుతారు. ప్రపంచంలోని ముక్తిప్రధానమైన పర్వతాల్లో ఒకటి కైలాసం కాగా రెండోది అమర్‌కంఠక్‌.
ఆమ్రకూట్‌!
ఈ ప్రాశస్త్యం అంతా విన్న మేము నర్మద పుట్టిన అమర్‌కంఠక్‌ను దర్శించాలన్న కోరికతో నలభై మందిమి కలిసి బయలుదేరాం. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కి చేరుకుని, రైల్లో పెండ్రా రోడ్డు దగ్గర దిగాం. పెండ్రా నుంచి కారుల్లో బయలుదేరి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమర్‌కంటక్‌కు చేరుకున్నాం. బిలాస్‌పూర్‌కు 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమర్‌కంఠక్‌ ప్రయాణం ఓ సుందర దృశ్య కావ్యంలా అనిపించింది. అమర్‌కూట్‌ పేరుతో ఈ పుణ్యక్షేత్రం గురించిన వివరాలు కాళిదాసు మహాకావ్యం మేఘసందేశంలో కనిపిస్తాయి. ఇక్కడ మామిడి(ఆమ్ర)చెట్లు ఎక్కువగా ఉండటంతో ఆయన ఆమ్రకూట్‌ అని వర్ణించాడట. అదే అమరకూట్‌గా ప్రాచుర్యం చెందింది.
మేం ముందుగా నర్మదా ఉద్గమ్‌ కాంప్లెక్స్‌కు వెళ్లాం. అక్కడ ఉన్న నర్మదాకుండ్‌లో పుణ్యస్నానం చేశాం. అందులో స్నానం చేస్తే దుఃఖాలన్నీ తీరతాయన్నది భక్తుల విశ్వాసం. ప్రధాన ఆలయమైన నర్మదామాతనీ దానికి ఎదురుగానే ఉన్న అమరకంఠేశ్వరుణ్ణీ దర్శించుకున్నాం. రేవా అనే లంబాడా వ్యక్తికి నర్మదా మాత కలలో కనిపించి ఆ ప్రదేశాన్ని చూపించిందనీ అప్పుడాయన వెదురుపొదలన్నీ తవ్వగా ప్రవాహం బయటపడిందనీ చెబుతారు. ఆయనే ప్రస్తుతం ఉన్న గుడి ప్రదేశంలో నర్మదా మాత ప్రతిమను నెలకొల్పారని చెబుతారు. ఇంకా ఇక్కడ కాశీ విశ్వనాథ మందిరం, రామ దర్బార్‌, శివాలయం... ఇలా దాదాపు 20 ఆలయాలు ఉన్నాయి. అవన్నీ చూశాక ఇక్కడకు ఒక కిలోమీటరు దూరంలోని ‘మై కీ బాగియా’ అనే ప్రదేశానికి వెళ్లాం. అక్కడ మామిడి, అరటి... వంటి పండ్లమొక్కలతోబాటు అందమైన పూలమొక్కలూ ఔషధమొక్కలూ కనువిందు చేస్తాయి. తరవాత దగ్గరలోనే పురావస్తు శాఖ అధీనంలోని పంచమఠం ఆలయాలు కూడా దర్శించుకున్నాం.
మర్నాడు కళ్యాణ్‌ బాబా ఆశ్రమం, శ్రీచక్రకుండ్‌ల మీదుగా సోన్‌ నది జన్మస్థానమైన సోన్‌ముడా దగ్గరకు వెళ్లాం. ఇక్కడినుంచి సూర్యోదయం అద్భుతంగా ఉంటుంది. తరవాత వంద అడుగుల ఎత్తునుంచి పడుతోన్న కపిల్‌ధారా జలపాతాన్ని చూపి పరవశించిపోయాం. ఇక్కడే కపిల రుషి ధ్యానం చేశాడనీ చెబుతారు. దూధ్‌ధారా జలపాతం దగ్గర కేవలం పది అడుగుల ఎత్తు నుంచే నీళ్లు పడుతుంటాయి. అయినప్పటికీ ఎంతో మనోహరంగా ఉంది.
దారిలో ఉన్న జైన్‌మందిరాన్ని సందర్శించి ఆపై జ్వలేశ్వర్‌ మహదేవుణ్ణి దర్శించుకునేందుకు వెళ్లాం. ఇక్కడి శివయ్య స్వయంభూ కావడం విశేషం. అక్కడనుంచి అమరేశ్వర్‌ చేరుకున్నాం. అక్కడ శివలింగం ఎత్తు సుమారు 11 అడుగులు. ఆ మహదేవుణ్ణి మారేడు, పంచామృతాలతో అభిషేకించాం. ఇక్కడకు సమీపంలోనే 11వ శతాబ్దానికి చెందిన కాలాచురి మహారాజు కర్ణదేవ నిర్మించిన ప్రాచీన ఆలయాల్ని సందర్శించాం. ఇక్కడ ఉన్న పాతాళేశ్వర్‌ మహదేవ ఆలయాన్ని తప్పక చూడాల్సిందే. తరవాత ధునిపానీకి చేరుకున్నాం. ఇక్కడే ఉన్న వ్యూపాయింట్‌ నుంచి చుట్టూ ఉన్న పచ్చని కొండల్ని తనివితీరా చూసి వెనుతిరిగాం.
ఏడాదిపొడవునా ఉండే చల్లని వాతావరణం, ఆపై కొండలనిండుగా ఉన్న రకరకాల ఔషధమూలికల కారణంగా అనేకమంది ప్రకృతి ప్రేమికులూ వృక్షశాస్త్ర నిపుణులూ తరచూ ఇక్కడకు వస్తుంటారు. అందుకే ఇది తప్పక చూడదగ్గ ప్రదేశం అనిపించింది.


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం