MohanPublications Print Books Online store clik Here Devullu.com

చాతుర్మాస్య వ్రతం, Chaturamyasa Vratam

చాతుర్మాస్య వ్రతం
Chaturamyasa Vratam 

++++++++++చాతుర్మాస్య వ్రతం +++++++
జులై నుంచి అక్టోబరు వరకు నాలుగు నెలలపాటు గృహస్థులు, సాధుసన్యాసులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించేదే ‘చాతుర్మాస్య వ్రతం’. ఇది ఆషాఢ శుక్ల ఏకాదశితో మొదలై, కార్తిక శుక్ల ఏకాదశితో ముగుస్తుంది. ఆర్షధర్మం గృహస్థ ఆశ్రమానికి పెద్దపీట వేసింది. బ్రహ్మచారి అయినా, సన్యాసి అయినా గృహస్థు అండదండలు లేకపోతే ఉండలేరు. అందుకే గృహస్థును కవి అల్లసాని పెద్దన ‘మంచినీటి దిగుడు బావి’తో పోల్చాడు.
చాతుర్మాస్యం హిందువులతో పాటు బౌద్ధులకు, జైనులకు పవిత్రమైన కాలం. మహావిష్ణువు ఈ సమయంలో శేషశయనుడై సేదతీర్చుకుంటూ ఉంటాడని, ఆయన యోగనిద్రకు ఎలాంటి భంగమూ కలగకుండా అందరూ జాగ్రత్తగా మసలుకోవాలని పురాణాలు చెబుతున్నాయి.
భాగవతులు ధర్మబోధ చేస్తూ, ప్రజల్ని సన్మార్గంలో నడిపించటానికి ప్రయత్నిస్తుంటారు. మరొక వైపు యోగులు మౌనంతో దైవధ్యానం సాగిస్తూ, చాతుర్మాస్య పుణ్యకాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. చేరువలో ఉన్న పుణ్యనదుల్లో పుష్కర స్నానాలు ఆచరిస్తారు. ఆధ్యాత్మికంగా భవ్యం, దివ్యం అయిన చాతుర్మాస్య వ్రతం ఏకాదశినాడు మొదలై మళ్ళీ ఏకాదశితోనే పూర్తికావడం విశేషం. అందువల్ల చివరిదైన కార్తిక ఏకాదశికి ‘ప్రబోధినీ ఏకాదశి’ అనే పేరు సార్థకమైంది.
ఆచారాల పరమార్థం- ఐహిక, ఆముష్మిక, ఆనంద రసాస్వాదనం. ఈ నాలుగు మాసాలూ వర్షాలు కురుస్తుంటాయి. బయటకు వెళ్లటం, ప్రయాణాలు చేయడం అంత సులభం కాదు. క్షేమమూ కాదు. దారులు మూసుకుపోయి, బురదపట్టి, ఒక్కొక్కప్పుడు అడుగుతీసి అడుగు వేయడమే గగనంగా మారుతుంటుంది. సన్యాసులు, భిక్షువులు పాదయాత్రల్ని కట్టిపెట్టక తప్పదు. వారు ఏదో ఒకచోట బస ఏర్పాటు చేసుకొని, నియమ నిష్ఠలకు అంతరాయం లేకుండా కాలం వెళ్లబుచ్చాల్సిందే.
ఇదే పుణ్యకాలంలో గృహస్థులు చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు. ఆశయసిద్ధి కోసం ఏకభుక్తంతో ఉపవసిస్తారు. ఆత్మనిగ్రహాన్ని పరీక్షించుకోవడానికి, పెంచుకోవడానికి ఈ సమయంలో తమకు ఇష్టమైన ఆహార పదార్థాలను త్యాగం చేస్తారు. వారు రాగద్వేషాలకు దూరమయ్యే కొద్దీ మోక్షమార్గం సుగమంగా మారుతుంది.
ఆషాఢమాసంలో, సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి దక్షిణ దిశగా పయనం సాగిస్తాడు. చాతుర్మాస్య వ్రతారంభం వల్ల దీన్ని ‘తొలి ఏకాదశి’ అని, మహావిష్ణువు శయనిస్తాడు కాబట్టి ‘శయన ఏకాదశి’ అని పిలుస్తారు. మహావిష్ణువుతో పాటు దేవతలూ విశ్రమిస్తారన్న భావంతో దీన్ని ‘దేవశయన ఏకాదశి’ అనీ వ్యవహరిస్తారు. దానధర్మాలు చేస్తూ, సన్యాసులకు సేవలందజేస్తూ, ప్రవచనాలు ఆలకిస్తూ, ఈ చాతుర్మాస్య కాలాన్ని గృహస్థులు సద్వినియోగం చేసుకోవచ్చు. ఆషాఢ పూర్ణిమ లేదా గురుపూర్ణిమ మొదలు భాద్రపద పూర్ణిమ వరకు ప్రవచనాలు, పుణ్యకార్యాలు కొనసాగుతుంటాయి.
‘వర్షయోగ్‌’ పేరిట జైనులు- ఈ కాలంలో పొరపాటునైనా జీవహింస జరగకూడదన్న సంకల్పంతో ఉంటారు. నోటికి వస్త్రం కట్టుకొని, కదలకుండా కూర్చొని, మౌనదీక్ష వహిస్తారు. ‘పర్యూషణ’ అనే కార్యక్రమంతో వారి వ్రతదీక్ష పరిసమాప్తమవుతుంది. పొరపాటున జరిగే హింస వల్ల ఎవరికైనా దుఃఖం కలిగి ఉంటే క్షమించాలని జైనులు ప్రార్థిస్తారు. మరికొందరు భద్రబాహు రచించిన ‘కల్పసూత్ర’ గ్రంథ పారాయణం ద్వారా జీవితాన్ని సార్థకం చేసుకుంటారు.
బుద్ధభగవానుడు తన పర్యటనలో మగధ చక్రవర్తి బింబిసారుడి శోకాన్ని పోగొట్టాడని, ఆయన బౌద్ధమతం స్వీకరించాడని, బుద్ధుడు చాతుర్మాస్య సమయంలో ఆయన వద్దనే ఉన్నాడని చెబుతారు.
ఈ చాతుర్మాసంలో ముఖ్యమైన హిందూ పండుగలు తలుపు తట్టడం మరో విశేషం. కృష్ణాష్టమి, రక్షాబంధనం, గణేశ చతుర్దశి, నవరాత్రి, విజయదశమి, దీపావళి వంటివి అసంఖ్యాక కుటుంబాలకు ఆహ్లాదం కలిగిస్తాయి. ఈ కాలంలో పరిమితమైన వ్రత భోజనం నియమాన్ని అనుసరిస్తారు. వర్షకాలంలో కలుషితమైన ఆహారం వల్ల ప్రజలు వ్యాధులపాలు కాకుండా ఈ వ్రతం కాపాడుతుంది. ఆచారంలో ఆరోగ్యసూత్రాలనూ పొందుపరచిన ఘనత ఇందులో కనిపిస్తుంది!
- ఉప్పు రాఘవేంద్రరావు


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---








No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list