MohanPublications Print Books Online store clik Here Devullu.com

మలి జీవితానికి మదుపు చేద్దాం, Malli Jeevithani Madhupu Chedam

మలి జీవితానికి మదుపు చేద్దాం
Malli Jeevithani Madhupu Chedam

+++++మలి జీవితానికి మదుపు చేద్దాం!++++
పెట్టుబడి అంటే కేవలం డబ్బును కూడబెట్టడం, సంపదను సృష్టించడం కాదు.. మన కోరికలు తీర్చుకోవడం, ఆర్థిక స్వేచ్ఛ కల్పించుకోవడం, మానసికంగా ప్రశాంతంగా ఉండటం.. ఇవీ దీని ప్రధాన లక్ష్యాలు. పెట్టుబడి పెట్టేందుకు సరైన సమయం అంటూ ఏమీ ఉండదు. ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత తక్కువ మొత్తంతో మనం అనుకున్న మొత్తాన్ని కూడబెట్టుకోవచ్చు. ముఖ్యంగా సంపాదన ప్రారంభంలోనే.. ఆ సంపాదన ఆగిపోయే రోజు గురించి ఆలోచిస్తూ.. పెట్టుబడులూ ఆరంభించాలి. ఆ దిశగా మన డబ్బును మళ్లించాలి. అప్పుడే ఆనందకరమైన జీవితం సాధ్యమవుతుంది.
ఆర్థిక లక్ష్య సాధనను పరిమిత ఓవర్ల క్రికెట్‌ మ్యాచ్‌తో పోల్చవచ్చు. విజయం సాధించాలంటే.. ఆ జట్టు ఉన్న వనరులన్నీ సమర్థంగా వినియోగించుకోవాలి. అప్పుడే గెలుపు సాధ్యం అవుతుంది. ఉన్న సమయంలోనే స్కోరు బోర్డును పరుగెత్తించాలి. అవసరాన్ని బట్టి దూకుడుగా ఆడాలి. లేదా నిలకడగా ఆడుతూ లక్ష్య సాధనకు ప్రయత్నించాలి. పదవీ విరమణ ప్రణాళికలు కూడా అంతే. సంపాదన ప్రారంభంలో 25 ఏళ్ల వయసులో పెట్టే పెట్టుబడులకూ.. 50 ఏళ్ల తర్వాత వేసుకునే ప్రణాళికలకూ కచ్చితంగా తేడా ఉంటుంది. పదవీ విరమణ దగ్గరకు వస్తున్న కొద్దీ.. నష్టభయం ఉన్న పథకాల నుంచి తప్పుకొంటూ.. స్ధిరాదాయం ఉన్న పెట్టుబడుల వైపు దృష్టి సారించాల్సి ఉంటుంది.
విమానాన్ని నడిపినట్లే..
ఆర్థిక ప్రణాళిక.. లక్ష్య సాధనను విమానాన్ని నడపడంలాంటిదే. విమానాన్ని ఒక చోట నుంచి మరో చోటకు నడపాలంటే.. ‘ఫ్లైట్‌ ప్లాన్‌’ కచ్చితంగా ఉండాలి. ఏ అంక్షాంశాల మీదుగా ప్రయాణం చేయాలి.. ప్రయాణం సమయం ఎంత? దానికి ఎంత ఇంధనం కావాలి.. వాతావారణ పరిస్థితులు ఏమిటి? ఇలాంటివన్నీ ముందే గమనించాలి. అదనంగా మరికొంత ఇంధనాన్నీ నింపుతారు. ఇదంతా పక్కా ప్రణాళిక వేసుకున్నా.. కొన్నిసార్లు అనుకోని అవాంతరాలు రావచ్చు. వాతావరణం అనుకూలించకపోవడం. ఆర్థిక లక్ష్యాలు కూడా అంతే.. మనం పెట్టుబడులు ఎప్పుడు ప్రారంభించాలో మనకు తెలుసు. ఎంత మొత్తం కావాలి.. ఉన్న వ్యవధి? ఎంత మొత్తం పొదుపు, మదుపు చేయాలి.. ఈ సమయంలో వచ్చే అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి? ఈక్విటీ, డెట్‌ పథకాలకు ఎంత శాతం కేటాయించాలి.. ఇవన్నీ చూసుకోవాలి. అదే సమయంలో ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోనికి తీసుకోవడం మర్చిపోవద్దు. ఒక్క పెట్టుబడి పథకమే మీ అన్ని ఆర్థిక లక్ష్యాలను తీర్చలేదు. అయితే, దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడి రావాలంటే.. కచ్చితంగా ఈక్విటీలను మీ పెట్టుబడుల్లో భాగం చేయడం మర్చిపోవద్దు.
రాబడి.. నష్టభయం..
పెట్టుబడి పథకం ఏదైనా అంతర్గతంగా నష్టభయం ఇమిడి ఉంటుంది. అందుకే మదుపు చేసేప్పుడు ఆ పథకంలో ఉన్న నష్టభయం ఏమిటి? రాబడి ఎంత రావచ్చు? ఎంత సమయం వేచి ఉండాలి అనే అంశాలను కచ్చితంగా తెలుసుకోవాలి. ఏ ఇతర పెట్టుబడి పథకాలతో పోల్చి చూసినా.. ఈక్విటీలు దీర్ఘకాలంలో మంచి రాబడినే అందిస్తాయి. అయితే, స్వల్పకాలంలో వీటిలో ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయని మర్చిపోవద్దు. అందుకే, పెట్టుబడుల్లో ఎప్పుడూ సమతౌల్యం ఉండాలి. చిన్న వయసులో ఉన్నవారు తమ పెట్టుబడుల్లో 70-80శాతం వరకూ ఈక్విటీలకు కేటాయించవచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ వీటికి కేటాయింపులు తగ్గిస్తూ ఉండాలి. పదవీ విరమణ చేసిన వారు కూడా తమ పెట్టుబడుల్లో కనీసం 10-20శాతం వరకూ దీర్ఘకాలిక అవసరాల కోసం ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడం అవసరం. సంపాదిస్తూ పదవీ విరమణ ప్రణాళికలు వేసుకునేప్పుడే కాదు.. పదవీ విరమణ తర్వాత కూడా ఈక్విటీ తోడు అవసరమే.
పన్ను ఆదా...
ఆదాయపు పన్నును వీలైనంత వరకూ తగ్గించుకోవడమూ ఆర్థిక ప్రణాళికలో భాగమే. ఆర్థిక లక్ష్యాల సాధనకు పెట్టుబడి పెట్టడంతోపాటు, వచ్చిన రాబడికి పన్ను భారం లేకుండా, లేదా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఒక పథకాన్ని ఎంచుకునేప్పుడు అది మీకు ఏ విధంగా నప్పుతుందో.. అది ఏ విభాగానికి చెందిందో అవగాహన ఉండాలి. దానివల్ల వచ్చే నష్టభయం, రాబడి గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాతే పన్ను ఆదా విషయం ఆలోచించాలి. పన్ను మినహాయింపు పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. ఆర్థిక లక్ష్య సాధనకూ ఉపకరిస్తుంది. స్థూల ఆర్థిక ప్రణాళికలో పన్ను ఆదా అనేది ఒక భాగం కావాలి. అంతేకానీ, పన్ను ఆదా కోసమే ఆర్థిక ప్రణాళిక అన్నట్లు ఉండకూడదు.
* ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80సీ కింద వివిధ పెట్టుబడి పథకాల్లో మదుపు చేసి రూ.1,50,000 వరకూ పన్ను ఆదా చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో మదుపు చేసినప్పుడు ఈ సెక్షన్‌ కింద రూ.1,50,000 పెట్టుబడి పెట్టి, మరో రూ.50,000లను సెక్షన్‌ 80సీసీడీ కింద మదుపు చేసుకోవచ్చు. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎన్‌పీఎస్‌లో మదుపు చేసినప్పుడు పన్ను మినహాయింపు వస్తుంది. కానీ, ఇందులో నుంచి పెట్టుబడిని వెనక్కి తీసుకునేప్పుడు కొంత శాతానికి పన్ను చెల్లించాల్సి వస్తుంది. అలాగే.. ఎన్‌పీఎస్‌ నుంచి వెనక్కి తీసుకునే మొత్తంలో కొంత భాగాన్ని బీమా కంపెనీల యాన్యుటీ ప్లాన్లలో మదుపు చేయాలి. ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆదాయంలో భాగంగా చూపించి, పన్ను చెల్లించాలి.
పెట్టుబడి పథకాలు వేటికవే భిన్నంగా ఉంటాయి. మనం మదుపు చేయాలనుకున్నప్పుడు ఆ పథకం బలాలు, బలహీనతలు అర్థం చేసుకోవాలి. దీర్ఘకాలంలో తక్కువ నష్టభయం, మంచి రాబడి సాధించేలా ఉండాలి. అదే సమయంలో పన్ను ప్రయోజనాలూ అందించాలి. అదే సమయంలో అత్యవసరాల్లో వెంటనే సొమ్ము చేసుకునేలా ఉండాలి. ఇవన్నీ మంచి పెట్టుబడి లక్షణాలు.
- ఆర్‌.రాజా, హెడ్‌ ఆఫ్‌ ప్రొడక్ట్స్‌, యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌

మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---







No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list