MohanPublications Print Books Online store clik Here Devullu.com

లెక్కలు మారిపోయాయి! లాభసాటి వ్యాయామం

లెక్కలు మారిపోయాయి!  లాభసాటి వ్యాయామం


లెక్కలు మారిపోయాయి!
లాభసాటి వ్యాయామం!
నేటి ఆధునిక కాలంలో సమయం విలువ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు బంగారమైనా అలవోకగా ఇవ్వొచ్చుగానీ.. సమయం మాత్రం ఇవ్వలేం! అందుకే నెలలు, రోజులు పోయి.. గంటలు, నిమిషాలను లెక్కించుకునే స్థితి వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో ప్రతి రోజూ ఓ ‘అర గంట’ సమయం మనం దేనిమీదైనా ఖర్చు పెట్టాలంటే.. మనకు ఎంత లాభం దక్కాలి? ప్రతిఫలం ఎంత పెద్దగా ఉండాలి? పరిశోధకులు కూడా దీని గురించే ఆలోచిస్తున్నారు. ఎవరైనాగానీ ప్రతి రోజూ అర గంట సమయం- వ్యాయామం కోసం వెచ్చించాలంటే.. దానితో ఒనగూడే లాభాలేమిటి? వ్యాయామం మీద వెచ్చించే ప్రతి నిమిషం.. మనకు అసమానమైన ఫలితాలనే అందిస్తోందని అధ్యయనాల్లో స్పష్టంగా తేలటం విశేషం. గుండెపోటు, పక్షవాతం వంటి పెద్దపెద్ద జబ్బులు రాకుండా నివారించుకోవటానికే కాదు.. మన దైనందిన జీవితం హాయిగా గడిచిపోవటానికి కూడా వ్యాయామమే సరైన మార్గమని ‘హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌’ పరిశోధనలు నొక్కి చెబుతున్నాయి. అందుకే దీనికి సంబంధించిన వివరాలను స్థూలంగా మీ ముందుకు తెస్తోంది ఈ వారం సుఖీభవ!
వ్యాయామంతో పెద్దపెద్ద జబ్బులు దరిజేరవన్నది అందరికీ తెలిసిందే. నిత్యం వ్యాయామం చేసే వారికి మధుమేహం, హైబీపీ, అధిక కొలెస్ట్రాల్‌, వూబకాయం వంటి ప్రమాదకర ముప్పులు బాగా తగ్గిపోతాయి. ఫలితంగా వీరిలో గుండెపోటు, పక్షవాతం, క్యాన్సర్‌ వంటి తీవ్ర సమస్యలూ దరిజేరవు. అయితే ఇవన్నీ ఎప్పుడో కొన్నేళ్ల తర్వాత పెద్దమొత్తంలో చేతికొచ్చే బ్యాంకు డిపాజిట్లలాగా.. వ్యాయామంతో సిద్ధించే దీర్ఘకాల ప్రయోజనాలు. వీటి గురించి ఇప్పుడు అందరికీ తెలుసు.
అయితే నిత్యం వ్యాయామం చెయ్యటం వల్ల- మధ్య మధ్యలో వడ్డీ చేతికొచ్చినట్టు- మనకు రోజువారీ జీవితంలో కూడా ప్రయోజనాలేమైనా దక్కుతాయా? అన్నది మరో ఆసక్తికరమైన అంశం. అవును, ఇలాంటి ప్రయోజనాలూ కచ్చితంగా దక్కుతాయంటోంది వైద్య పరిశోధనా రంగం. వ్యాయామం చెయ్యటం వల్ల రోజు మొత్తం ఉత్సాహంగా గడుస్తుంది. మనలో చురుకుదనం పెరుగుతుంది. శృంగార జీవితంలోనూ కొత్త రుచులను ఆస్వాదించొచ్చు. జీవితం ప్రతిరోజూ హాయిగా గడుస్తుంది. ఇన్ని లాభాలున్నాయి కాబట్టే.. ఎప్పుడో రాబోయే జబ్బుల నివారణకే కాదు.. ఏ రోజుకారోజు మన జీవితాన్ని ఆహ్లాదభరితం చేసుకునేందుకు కూడా వ్యాయామం ముఖ్యమని వైద్యపరిశోధనా రంగం ఇప్పుడు స్పష్టంగా నొక్కి చెబుతోంది.
ఎంత చెయ్యాలి.. ఏమిటి లెక్క?
మరీ తేలికపాటి వ్యాయామంతో కానిచ్చెయ్యకుండా ఓ మోస్తరు నుంచి కఠినంగా చెయ్యటం వల్ల మంచి ప్రయోజనాలు సిద్ధిస్తున్నాయని పరిశోధకులు గ్రహించారు. అయితే మనం చేస్తున్న వ్యాయామం ఏ స్థాయిలో ఉంటోంది? అది సరిపోతోందా? లేదా? అలాగే వ్యాయామం చేస్తున్న కొద్దీ మన శారీరక దారుఢ్యం, సామర్థ్యం మెరుగవుతోందా? లేదా? అన్నది తెలుసుకోవటం కూడా చాలా అవసరం. దీనికోసం నిపుణుల కొన్ని సులభమైన, ఎవరికి వాళ్లు తెలుసుకోగలిగిన పద్ధతిని రూపొందించారు. మనం చేసే వ్యాయామం ఏ స్థాయిలో ఉంటే- మనకు ఎలాంటి శారీరక లక్షణాలు కనబడుతుంటాయన్నది గుర్తించారు. వ్యాయామం చేస్తూ, మన శారీరక సామర్థ్యం మెరుగవుతున్న కొద్దీ మనం ఒకప్పుడు కష్టంగా భావించిన వాటిని కూడా పెద్ద కష్టపడకుండా, తేలికగా పూర్తి చెయ్యగలుగుతుంటాం. కాబట్టి మన వ్యాయామ తీవ్రత ఏ స్థాయిలో ఉందన్నది తెలుసుకునేందుకు ఈ పట్టిక బాగా ఉపయోగపడుతుంది.
నిత్య వ్యాయామం.. పచ్చటి జీవితం
మానసిక ఉత్తేజం
వ్యాయామంతో పెద్దపెద్ద మానసిక వ్యాధులు సమసిపోకపోవచ్చుగానీ వ్యాయామానికీ, మానసిక ఉత్సాహానికీ మధ్య బలమైన సంబంధం ఉందని పరిశోధనల్లో స్పష్టంగా గుర్తించారు. ఏరోబిక్‌ వ్యాయామాలు చెయ్యటం వల్ల మానసిక ఉత్తేజాన్నిచ్చే హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఈ హార్మోన్లు ‘ఒత్తిడి’ని తుడిచేసి- మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నామన్న భావనను ప్రేరేపిస్తాయి. రెండోది- దాదాపుగా అన్ని రకాల వ్యాయామాల్లోనూ కూడా కండరాలను ఒక క్రమపద్ధతిలో ఆపకుండా కదిలించాల్సి ఉంటుంది. ఈ సమయంలో మెదడును ఉత్తేజపరిచే ‘సెరటోనిన్‌’ అనే హార్మోన్‌ విడుదల అవుతుంది, ఇది ప్రతికూల ఆలోచనలు దరిజేరకుండా చూస్తుంది. దీనివల్ల హాయిగా జీవిస్తున్నామన్న మానసిక తృప్తి పెరుగుతుంది.
శృంగార ఉద్దీపన
ఓ మోస్తరు నుంచి కఠినమైన వ్యాయామాలు చెయ్యటం వల్ల లైంగిక ఆసక్తులు పెరగటమే కాదు.. పటుత్వం, సామర్థ్యం కూడా మెరుగవుతాయి. దీనిపై హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు లోతుగా అధ్యయనం చేశారు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు గడిపే వారికంటే క్రమం తప్పకుండా రోజూ కనీసం 30 నిమిషాల పాటు ఏదో ఒక వ్యాయామం చేసేవారిలో అంగస్తంభన సమస్యలు తక్కువగా ఉంటున్నాయి. వ్యాయామంతో ఈ ముప్పు 41% వరకూ తగ్గిపోతోందని వీరు గుర్తించారు. వ్యాయామం వల్ల పురుషులకే కాదు, లైంగికంగా స్త్రీలకూ ప్రయోజనాలు కనబడుతున్నాయి. రోజూ 20 నిమిషాల పాటు సైక్లింగ్‌ చేసే మహిళల్లో శృంగార వాంఛలు 169% పెరిగినట్లు మరో అధ్యయనంలో తేలింది.
తెలివితేటలు ఉరకలు
శారీరక శ్రమ, వ్యాయామం వల్ల మెదడుకు రక్తప్రసారం పెరుగుతుంది. ఫలితంగా మెదడు పనితీరూ మెరుగవుతుంది. ముఖ్యంగా వ్యాయామం చేసేవారి వూపిరితిత్తులు చాలా సమర్థంగా పని చేస్తాయి, ఇలాంటి వారిలో వయసు మీద పడుతున్నా కూడా జ్ఞాపకశక్తి చెక్కుచెదరటం లేదు, మెదడు చురుకుదనం తగ్గటం లేదని గుర్తించారు.
నిద్ర సుఖప్రదం
నిత్యం ఏరోబిక్‌ వ్యాయామాలు చేసేవారిలో నిద్రకు సంబంధించి మూడు రకాల ప్రయోజనాలు దక్కుతున్నాయి. వ్యాయామం చేసిన రోజున- తేలికగా నిద్రపడుతుంది. నిద్ర పోవటంలో కూడా వీరు ఎక్కువ సమయం ‘గాఢ నిద్ర’లో గడుపుతారు. అలాగే రాత్రి నిద్రలో తరచూ మెలకువ రావటం, నిద్రాభంగం కావటమన్నది వీరిలో చాలా తక్కువగా ఉంది. వాస్తవానికి నిద్రలో 5 దశలుంటాయి. వీటిలో ‘గాఢనిద్ర’ దశ అత్యంత కీలకమైనది, మన శరీరం ఈ దశలోనే రకరకాల మరమ్మతులు చేసుకుంటూ శక్తిని పుంజుకుంటుంది. ఈ గాఢ నిద్ర దశను పెంచుకోవటానికి మనకున్న ఒకే ఒక్క మార్గం వ్యాయామం చెయ్యటం!
కదలికలు చురుకు
చిన్నపిల్లలు చాలా చెలాకీగా కదులుతుంటారు. అందుకు వారి శరీరం అద్భుతంగా సహకరిస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ క్రమేపీ శారీరక కదలికలు తగ్గుతుంటాయి. సహజంగానే వ్యవస్థలన్నీ బలహీనపడుతూ, శరీరాన్ని క్షీణత ఆవరిస్తుంటుంది. అయితే నిత్యం వ్యాయామం చేసే వారిలో ఈ క్షీణత చాలా తక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. పెద్దవయసులో కూడా నిత్య వ్యాయామం చెయ్యటం ద్వారా- శారీరక దారుఢ్యాన్ని, జీవక్రియల వేగాన్ని, కండరాల పనితీరును చక్కగా కాపాడుకోవచ్చని, వ్యాయామం చేసేవారు ఈ విషయంలో పిల్లలతో పోటీ పడొచ్చని పరిశోధకులు గుర్తించారు. మధ్యవయసులో బాగా వ్యాయామం చేసేవారు వృద్ధాప్యంలో కూడా ఇతరుల మీద ఆధారపడకుండా హాయిగా తిని తిరుగుతున్నట్టు గమనించారు.


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---






No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list