MohanPublications Print Books Online store clik Here Devullu.com

రైతుకు... ప్రేమతో, Prematho.... Farmer

రైతుకు... ప్రేమతో
Prematho.... Farmer


+++++++++రైతుకు... ప్రేమతో!++++++++
రైతు కష్టాలు కదిలించాయి. పంట నష్టాలు ఆలోచింపజేశాయి. అన్నదాతకు అండగా నిలిచేందుకూ, సాంకేతిక సాయం అందించేందుకూ ఎంతోమంది ‘అగ్రి’ప్రెన్యూర్స్‌ ముందుకొస్తున్నారు. కొత్త ఆలోచనలతో ఆవిష్కరణల పంట పండిస్తున్నారు.
‘అన్నా!
రైతన్నా!!
నాగలిపట్టిన నిన్ను చూస్తుంటే, శిలువ మోస్తున్న జీసస్‌ గుర్తుకొస్తాడు, నెత్తిన ముళ్ల కిరీటంతో సహా! వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్లూ, బ్యాంకుల నోటీసులూ నిన్ను ముళ్లై బాధిస్తున్నాయి కదూ! మట్టిని నమ్ముకున్న నీ నోట్లో మట్టికొడుతున్నారు దళారులు. నూటపాతిక కోట్ల కడుపుల ఆకలి తీరుస్తున్నా, నీ డొక్కలు మాత్రం ఎండిపోయినట్టే కనిపిస్తున్నాయి, మండిపోతున్నట్టే అనిపిస్తున్నాయి. పొలంలో పొర్లాల్సిన గంగ, నీ కళ్లలో పొంగుతోందెందుకు? ఏరువాకకు సాగాల్సిన జోడెడ్లు సంత దారి పడుతున్నాయేమిటి? ఇల్లాలి మెడలోని మంగళసూత్రాల్ని ఏ గద్ద తన్నుకుపోయింది? బడికెళ్లాల్సిన బిడ్డల్ని కార్ఖానాలకు తోలావెందుకు? గమనిస్తూనే ఉన్నాం. మార్కెట్‌ శక్తులెప్పుడూ దుష్టశక్తుల్లా నిన్ను దెబ్బతీస్తూనే ఉంటాయి. పంట పండినా, పండకపోయినా నీకు కడుపుమంటే మిగుల్తుంది. ధరలుంటే దిగుబడి ఉండదు, దిగుబడి ఉంటే ధరలుండవు. అయినా సరే, కుంగిపోవద్దు. కుమిలిపోవద్దు. నీ కష్టాన్ని తీర్చేస్తాం, నీ నష్టాన్ని పూడ్చేస్తాం’ ...అంటూ మట్టిమనిషికి గట్టి భరోసా ఇస్తున్నాయి వ్యవసాయ అంకుర సంస్థలు. అంతా ఏ ఇంజినీరింగ్‌ నేపథ్యం నుంచో వచ్చినవాళ్లే. కార్పొరేట్‌ కొలువుల్లో ఎంతోకొంత అనుభవం సంపాదించినవాళ్లే. ‘ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌’ మీద పట్టున్నవాళ్లే. ఎటు పోతోందో తెలియని కెరీర్‌ పరుగుతో విసిగి వేసారినవాళ్లే. అందులో రైతు బిడ్డలున్నారు, పల్లెలంటే తెలియని పట్నం బాబులూ ఉన్నారు.
ఈరోజు వరకూ డెబ్భైశాతం భారతదేశం గ్రామాల్లోనే ఉంది. ఎనభైశాతం గ్రామీణులు వ్యవసాయాన్నే నమ్ముకున్నారు. ఆ వ్యవసాయంలో అనేకానేక సమస్యలున్నాయి. ఆ సమస్యలకు టెక్నాలజీలో పరిష్కారం ఉంది. సదరు టెక్నాలజీ యువ ఎంట్రప్రెన్యూర్స్‌ దగ్గర ఉంది. అంటే, రైతు + ఎంట్రప్రెన్యూర్‌ - ఇద్దరూ చేతులు కలిపితే...సేద్యం మారుతుంది, రైతు జీవితం మారుతుంది, పల్లె మారిపోతుంది. ఓ అంకుర సంస్థ నిలబడుతుంది. ఇప్పటికే చాలామంది యువకులు తమ ‘పచ్చని’ కలల్ని నిజం చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. పరిమితంగా ఒకట్రెండు రాష్ట్రాల్లో ప్రారంభించి అంచెలంచెలుగా విస్తరిస్తున్నారు.
ఎంత కాలమైనా...
టమాటా విరగబండుతుంది. కోసినకొద్దీ కాయలే. తెంచినకొద్దీ పంటే. అయినా, ఏం లాభం? ధర ఉండదు. ధైర్యంచేసి మార్కెట్‌కు తీసుకెళ్లినా, లారీ అద్దె కూడా గిట్టుబాటు కాదు. ఆ పరిస్థితుల్లో ఒకటే దారి...ఆ కాయల్ని నిర్దయగా నలిపేయడం...నీటిపాలు చేసేయడం, చెత్తకుప్పలో పడేయడం! ఆ కఠిన నిర్ణయానికి రావడానికి, రైతన్న ఎంత గుండెకోత అనుభవిస్తాడో! ఏ శిల్పి అయినా, తాను తీర్చిదిద్దిన శిల్పాన్ని శిథిలం చేసుకుంటాడా, ఏ చిత్రకారుడైనా తాను ప్రాణంపోసిన బొమ్మ మీద మసి పూయాలనుకుంటాడా? రైతుకు మాత్రం ఆ దుస్థితి ఎందుకు?...ఎందుకంటే, అతడి దగ్గర నిల్వ సామర్థ్యం లేదు. గిడ్డంగులకు వేలకువేలు అద్దె చెల్లించే స్తోమత లేదు. ధరలు పెరిగేదాకా ఎదురుచూసేంత ఓపికా లేదు. రైతు బతుకు దినదినగండం.
సొంతంగా శీతలీకరణ గిడ్డంగుల్ని ఏర్పాటు చేసుకోవడం సామాన్య రైతులకు తలకు మించిన భారమే. దీనికితోడు పల్లెల్లో కరెంటు కోతలు! ఐఐటీ ఖరగ్‌పూర్‌ పూర్వ విద్యార్థులు ఈ రెండు పరిమితుల్నీ అధిగమించాలనుకున్నారు. విద్యుత్తుకు ప్రత్యామ్నాయంగా సౌరశక్తిని వినియోగించుకున్నారు. శీతలీకరణ యంత్రాల ఏర్పాటుకు అయ్యే ఖర్చునూ చాలామేర తగ్గించారు. వివేక్‌ పాండే, దేవేందర్‌ గుప్తా, ప్రతీక్‌ సింఘాల్‌ ‘ఎకోఫ్రోస్ట్‌’ పేరుతో సన్నకారు రైతులకు ఉపయోగపడేలా చలువ పెట్టెల్ని తయారు చేస్తున్నారు. సౌర పలకల కప్పుతో చిన్న రేకుల షెడ్డును పోలి ఉంటుందా నిర్మాణం. నిర్వహణ వ్యయం నామమాత్రం కాబట్టి, రైతుకు అదనపు ఖర్చులేం ఉండవు. ఐఐటీ ముంబయి ‘యురేకా-2015’లో దీనికి ఉత్తమ ఆవిష్కరణ అవార్డు వచ్చింది.
అసలు, పంట నేరుగా వ్యాపారి కార్ఖానాకు వెళ్లిపోతే గిడ్డంగుల బాధే ఉండదు. అట్నుంచి అటే, తాజాగా వినియోగదారుడికి అందించవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌ జనార్దన్‌ స్వహార్‌ రైతుల మీద ప్రేమతో...దలాల్‌స్ట్రీట్‌ను వదిలిపెట్టి వ్యవసాయ వ్యాపారంలోకి వచ్చాడు. వై-కుక్‌ పేరుతో ఫుడ్‌ టెక్నాలజీ కంపెనీని స్థాపించాడు. వై-కుక్‌ మొక్కజొన్నలూ పళ్లూ కూరగాయలూ రైతుల నుంచి నేరుగా కొంటుంది. కొద్ది గంటల వ్యవధిలోనే వాటిని శుభ్రం చేసి...అంతర్జాతీయ ప్రమాణాలతో ప్యాక్‌ చేస్తుంది. ఇక, ఏడాది పాటూ నాణ్యతలో, రుచిలో, రంగులో ఏమాత్రం తేడా రాదని బల్లగుద్ది చెబుతున్నాడు వై-కుక్‌ జనార్దన్‌. జనాల జిహ్వల్ని హానికరమైన చిరుతిళ్ల నుంచి సంప్రదాయమైన భారతీయ రుచులవైపు మళ్లించాలన్నది ఈ అగ్రిప్రెన్యూర్‌ వ్యూహం. మసాలా మొక్కజొన్నల్నీ, ఉడికించిన సెనగల్నీ, పళ్లనీ వై-కుక్‌ ఆకర్షణీయమైన పొట్లాల్లో విక్రయిస్తోంది. ఇవన్నీ వ్యవసాయ ఆధారిత రుచులు కాబట్టి, రైతూ బాగుపడుతున్నాడు. భూసార పరీక్ష మొదలు పంటను బండికి ఎక్కించేదాకా...ప్రతి దశలోనూ వై-కుక్‌ సాంకేతిక సహకారం అందిస్తుంది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలలో చాలామంది రైతులు ఆ బాటలో నడుస్తున్నారు.
జలగండాన్ని గెలిచి...
నీటి కొరత వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా వేధిస్తోంది. పాతాళానికి గొట్టాలేసి తోడుకోవాల్సిన పరిస్థితి. ఆ కాసిన్ని నీళ్లు కూడా పొలానికంతా సరిపోవడం లేదు. దీంతో నాలుగెకరాల రైతు ఏ రెండెకరాల్లోనో పంటలు వేసుకుని, మిగతా పొలాన్ని బీడుపెడుతున్నాడు. ఉన్న కొద్దిపాటి నీటిని సమర్థంగా పారించుకుంటే నిక్షేపంగా నాలుగు ఎకరాల్లో మంచి పంట తీయవచ్చు. కానీ, ఏ మొక్కకు ఎన్ని నీళ్లు కావాలన్న విషయంలో రైతుకు ఓ అవగాహన ఉండటం లేదు. రైతుకేనా, చాలా సందర్భాల్లో వ్యవసాయ అధికారుల పరిజ్ఞానమూ అంతంతమాత్రమే. రైతుబిడ్డగా సతీష్‌కు అవన్నీ తెలియనివి కాదు. కర్ణాటకలోని చిత్రదుర్గ దగ్గర అతడి స్వగ్రామం. కుటుంబమంతా కష్టపడినా పెద్దగా ఫలితం ఉండేది కాదు. సతీష్‌ను మాత్రం, ఇంజినీరింగ్‌ దాకా చదివించగలిగాడు తండ్రి. ఆతర్వాత హెచ్‌సీఎల్‌లో ఉద్యోగం వచ్చింది. అక్కడ రకరకాల హోదాల్లో పనిచేశాడు. చాలా సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించాడు. పదిహేనేళ్ల తర్వాత, మనసెందుకో వ్యవసాయం మీదికి మళ్లింది. పొలానికెళ్లి చూశాడు. అవే, పాత పద్ధతులు. అంతే, అత్తెసరు దిగుబడి. జలవనరుల నిర్వహణ కూడా ఎప్పట్లానే ఉంది. కాస్తంత టెక్నాలజీని జోడిస్తే...సేద్యాన్ని లాభసాటిగా మార్చవచ్చేమో అనిపించింది. తనకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయానికి మళ్లించాడు. ‘ఫ్లైబర్డ్‌ ఫార్మ్‌ ఇన్నొవేషన్స్‌’ను స్థాపించాడు. ‘సిరి’ పేరుతో సతీష్‌ ఆవిష్కరించిన నీటి సరఫరా టెక్నాలజీ రైతు శ్రమను తగ్గిస్తుంది. పొలంలోని నీటి సరఫరా వ్యవస్థకు దీన్ని కనుక అనుసంధానం చేస్తే...ప్రతి నీటి చుక్కనూ లెక్కగట్టి, తూకమేసినంత కచ్చితంగా పంటకు కేటాయిస్తుంది. ఏ సాగుకు ఎంత తడి కావాలో, ఏ సమయంలో ఏ మేరకు నీళ్లు పెట్టాలో అందులో అప్పటికే నమోదై ఉంటుంది. మట్టిలోని తేమశాతాన్ని బట్టి ఎన్ని నీళ్లు పెట్టాలన్నదీ నిర్ణయిస్తుంది. ‘రెయిన్‌ సెన్సర్స్‌’నూ జోడించడంతో, వర్షపాతాన్నీ లెక్కలోకి తీసుకుంటుంది. మొబైల్‌ అప్లికేషన్‌తో ఈ మొత్తం వ్యవస్థను ఎక్కడి నుంచి అయినా నియంత్రించవచ్చు. ‘సిరి’ టెక్నాలజీని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో ఉపయోగిస్తున్నట్టు సతీష్‌ బృందం చెబుతోంది.
ఎక్కడో అమెరికాలో పుట్టిపెరిగిన పీటర్‌ ఫ్రిక్‌మాన్‌నూ మన రైతుల కష్టాలు కదిలించాయి. గ్రామీణ భారతాన్ని అమితంగా ప్రేమించే పీటర్‌ ఏడాది పాటూ వందలకొద్దీ పల్లెల్ని సందర్శించాడు. చిన్నచిన్న కమతాల్లో సేద్యం చేసుకునే రైతుల స్థితిగతులు అతడ్ని ఆలోచింపజేశాయి. పరిమిత జలవనరులు ఉన్నప్పుడు బిందు సేద్యమే మేలు. కానీ, సన్నకారు రైతులు అంత ఖర్చును భరించలేరు. దీంతో, తన ఇంజినీరింగ్‌ ప్రావీణ్యంతో చిన్న రైతులకూ పనికొచ్చేలా చవకైన బిందుసేద్య విధానాన్ని రూపొందించాడు. ‘టెక్నాలజీని మరింత సరళంగా మార్చడం వల్లే ఇదంతా సాధ్యమైంది. దీనివల్ల రైతుకు నిర్వహణా సులభం అవుతుంది’ అంటాడు పీటర్‌. పుణె కేంద్రంగా పనిచేస్తున్న ‘డ్రిప్‌టెక్‌’ ఇప్పటిదాకా పదివేల ఎకరాల్ని పచ్చగా మార్చేసింది.
కర్ణాటకలోని బిజాపూర్‌ ప్రాంతానికి చెందిన గిరీష్‌ కనిపెట్టిన చవకరకం ‘బోర్‌వెల్‌ స్కానర్‌’ చాలా సమస్యల్ని పరిష్కరిస్తోంది. దానికి అమర్చిన కెమెరా 360 డిగ్రీల్లో గొట్టాన్ని వీడియో తీస్తుంది. బోరు ఎందుకు పనిచేయడంలేదో, లోపల లీకేజీ ఏమైనా ఉందో, అసలు ఏ మట్టంలో నీళ్లున్నాయో సచిత్రంగా చెబుతుంది. ‘మా వూళ్లొ రైతుల కష్టాలే నన్ను ఆవిష్కర్తను చేశాయి’ అంటాడా యువకుడు. తన వ్యవసాయ ఆవిష్కరణల్ని విక్రయించడానికి ‘శాంటెప్‌ సిస్టమ్స్‌’ పేరుతో ఓ కంపెనీని కూడా స్థాపించాడు. గిరీష్‌ ఖాతాదారుల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలూ ఉన్నారు.
పల్లెంటే మనుషులే కాదు, పశుసంపదా! వాణిజ్య పంటలు పెరిగిపోయాక...పశువులకు కడుపునిండా దాణా దొరకడం లేదు. దొరికినా..అందులో పోషక విలువలు నామమాత్రమే! దీంతో బసవన్న బలహీనంగా తయారవుతున్నాడు, గోమాత గిన్నెనిండా కూడా పాలివ్వలేకపోతోంది. నిఖిల్‌బోరా అనే యువకుడు ఏదో పనిమీద ఓ గ్రామానికి వెళ్లినప్పుడు, పోషక విలువల లోపంతో జీవకళ కోల్పోయిన మూగజీవాల్ని చూశాడు. గుండె కదిలిపోయింది. అంతే, తన బిజినెస్‌ ప్లాన్‌ను పక్కన పడేసి, పల్లె అవసరాల మీద దృష్టి సారించాడు. ‘క్యాటిల్‌ మెటిల్‌’ పేరుతో ఓ సంస్థను స్థాపించి ... పోషక విలువలున్న దాణా వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈ జోధ్‌పూర్‌ కుర్రాడి ఆలోచనకు అనేక అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ‘వియ్‌ వర్క్‌ వేర్‌ నథింగ్‌ గ్రోస్‌’ - నిఖిల్‌ నినాదం. గడ్డిపోచ కూడా మొలవనిచోటే మేం ఎదుగుతాం అని చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలి, తన ఆలోచన మీద తనకెంత నమ్మకం ఉండాలి!చీడపీడల పోరు...
పంటల్ని పీల్చి పిప్పిచేసే చీడపీడలు రైతుల శ్రమఫలాన్ని రాబందుల్లా తన్నుకుపోతున్నాయి. సేద్యానికయ్యే ఖర్చులో పావుభాగానికి పైగా క్రిమినాశినులకే వెళ్లిపోతోంది. కొన్నిసార్లు అంతకంటే ఎక్కువే కావచ్చు. ఆ రసాయన యుద్ధంలో నేలకు ఎంతోకొంత మంచిచేసే ప్రాణులు కూడా నాశనం అయిపోతున్నాయి. దీంతో, పంట నాసిరకంగానే ఉంటోంది. పెట్టుబడి డబ్బు వెనక్కి వచ్చినా గగనమే. రైతుల్ని ఆ విష వలయం లోంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు లోకేశ్‌ మకం లాంటి అగ్రిప్రెన్యూర్స్‌. ఈ ఎంబీయే పట్టభద్రుడు చాలా కాలం ఫార్మారంగంలో పనిచేశాడు. రసాయనాల దుష్ప్రభావాలు ఎంత తీవ్రంగా ఉంటాయో, మనిషి శరీర వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేస్తాయో అతడికి తెలుసు. తన వంతుగా ఆ ఉపద్రవానికి వ్యతిరేకంగా ఏదైనా చేయాలనే ఆలోచనతో ‘బారిక్స్‌’ అనే కంపెనీని స్థాపించాడు. ఈ సంస్థ క్రిమికీటకాల్ని ఆకర్షించే రసాయనాలతో పట్టీలనూ డబ్బాలనూ తయారు చేస్తోంది. వాటి వాసనలు చీడపీడల్ని ఆకర్షిస్తాయి. అవన్నీ నేరుగా వచ్చి డబ్బాలో పడిపోతాయి. ఈ పరికరాల కొనుగోలుకు అయ్యే ఖర్చు క్రిమిసంహారకాల ధరలతో పోలిస్తే నామమాత్రం. రసాయనాల జాడ ఉండదు కాబట్టి, మార్కెట్లో కాయగూరలూ పళ్లూ మంచి ధర పలుకుతాయి. లోకేశ్‌ ఇప్పటికే రెండు లక్షలకుపైగా పరికరాల్ని విక్రయించాడు. టాంజానియా, మారిషస్‌, శ్రీలంక తదితర దేశాలకూ ఎగుమతి చేశాడు.
అభివృద్ధి చెందిన దేశాల సగటు ఉత్పత్తితో పోలిస్తే, భారతీయ రైతు ఎక్కడో అడుగున ఉంటాడు. అక్కడ ఉన్నదీ ఇక్కడ లేనిదీ యాంత్రికీకరణే! వ్యవసాయ యంత్రాల్ని కొనుగోలు చేయడం ఓ మోస్తరు మోతుబరులకు కూడా అసాధ్యమైన పని. ఇక చిన్నరైతులేం కొంటారు. అదే, అద్దెకు తెచ్చుకునే వెసులుబాటు ఉంటే? ధైర్యంగా ముందుకొస్తారు. ఓ ట్రాక్టర్ల తయారీ కంపెనీలో సీయీవోగా పనిచేసిన రోతష్‌మల్‌... విక్రయ లక్ష్యాలూ, మార్కెట్‌ ఆధిపత్యాల చుట్టూ తిరిగే ఇరుకిరుకు ప్రపంచానికే పరిమితం కాలేక కార్పొరేట్‌ సన్యాసం తీసుకున్నాడు. ఇఎమ్‌-3 పేరుతో అత్యాధునిక వ్యవసాయ ఉపకరణాల్ని అద్దెకిచ్చే వ్యాపారం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఎంపీ, బీహార్‌, యూపీలలో సేవలు అందిస్తున్నాడు. ‘నేను సంతోషంగా ఉన్నా, రైతూ సంతోషంగానే ఉన్నాడు. అంతకంటే ఏం కావాలి?’ అని సంబరంగా చెబుతాడు మల్‌.
ఇ-కామర్స్‌ దిశగా...
దేశంలో చిన్నాచితకా వ్యాపారాలు కూడా ఇ-కామర్స్‌తో లాభపడుతున్నాయి. వ్యవసాయం మాత్రం ఆ ప్రయత్నంలో వెనుకబడి పోయింది. ఇంకా దళారీ వ్యవస్థే రాజ్యమేలుతోంది. ఆ లోపాన్ని సవరించే దిద్దుబాటు చర్యా మొదలైంది. ఏ ముంబయి శివార్లలోనో ఉన్న కంపెనీలో ఎరువులు తయారు అవుతాయి. అక్కడి నుంచి ప్రధాన పంపిణీదార్లకూ, అట్నుంచి పెద్ద డీలరుకూ, ఆపైన చిన్న డీలరుకూ, చివరగా చిల్లర వ్యాపారికి...రైతు కొనుక్కునే దాకా మధ్యలో చాలా వ్యవస్థలే ఉంటాయి. అంచెలు పెరిగినకొద్దీ సరుకు ధరా పెరుగుతుంది. ఆ భారమంతా రైతే మోయాలి. అదే ఏ ఇ-కామర్స్‌ పద్ధతిలోనో కొనగలిగితే...తయారీదారుడికీ కొనుగోలుదారుడికీ దూరం తగ్గుతుంది. ఆ మేరకు ధరలూ తగ్గుముఖం పడతాయి. శార్దూల్‌, సీతాంశుసేథ్‌...నేతృత్వంలోని ‘అగ్రోస్టార్‌’ బృందం వ్యవసాయ మార్కెట్‌లో ఈ సూత్రాన్నే అనుసరిస్తోంది. రైతుకు ఇంటర్నెట్‌ మీద ఏమాత్రం అవగాహన లేదన్న సంగతి సేథ్‌ బ్రదర్స్‌కు తెలియంది కాదు. కాబట్టే మిస్డ్‌కాల్‌ మార్గాన్ని ఎంచుకున్నారు. రైతు నుంచి మిస్డ్‌కాల్‌ అందగానే, కాల్‌సెంటర్‌ నుంచి ఫోను వెళ్తుంది. రైతన్నకు కావలసిన సరుకుల వివరాలు తీసుకుంటారు. కొరియర్‌లోనో మరో మార్గంలోనో ఎరువులూ విత్తనాలూ వ్యవసాయ పనిముట్లూ ఇంటికి చేరతాయి. ఇప్పటిదాకా తమ దగ్గర లక్షమందికి పైగా రైతులు పేర్లు నమోదు చేసుకున్నట్టు శార్దూల్‌ బృందం చెబుతోంది. ప్రస్తుతానికి గుజరాత్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో సేవల్ని అందిస్తున్నారు. ఇదే పద్ధతిలో ఆన్‌లైన్‌లో పంట అమ్ముకునే అవకాశం ఉంటే, రైతుకు మరింత ప్రయోజనం. ఆ ప్రయత్నమూ మొదలైంది. రాళ్లపల్లి త్యాగరాజ్‌ సోదరులు కిసాన్‌మార్కెట్‌.కామ్‌ ద్వారా దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలనుకుంటున్నారు. రైతులు తమ పంట వివరాల్ని...ధరలతో సహా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే సరిపోతుంది. కొనదలుచుకున్నవారు ఒక్క ‘క్లిక్కు’తో ఆర్డరు పంపిస్తారు. దీనివల్ల రైతుకు లాభం, కొనుగోలుదారుకూ ప్రయోజనమే. రొయ్యల రైతుల కోసం ‘ఆక్వాయాప్‌’ ద్వారా ఇలాంటి ప్రయోగమే చేస్తున్నాడు వేణు దంతులూరి. ‘అగ్రిబజార్‌.కో’ కూడా రైతులకూ వినియోగదారులకూ వారధిగా నిలుస్తోంది. ‘భీమవరం ప్రాంతంలో సేద్యం చేసుకుంటున్న ఓ మిత్రుడి ఇబ్బందుల్ని చూశాకే ఈ ఆలోచన వచ్చింది’ అంటాడు వ్యవస్థాపకుడు చౌదుల వెంకట నరసింహారావు.
* * *
ఏ ఆన్‌లైన్‌ సెల్‌ఫోన్ల దుకాణమో, బట్టలకొట్టో అంటే ఇన్వెస్టర్లు పోటీపడి పెట్టుబడులు పెడతారు. అదే, వ్యవసాయం పేరు చెబితే చాలు...బ్రీఫ్‌కేస్‌ సర్దుకుని వెనక్కి వెళ్లిపోతారు. కారణం...రైతంటే చిన్న చూపు, గ్రామీణ మార్కెట్లంటే అపనమ్మకం. గత ఏడాది వెంచర్‌ సంస్థల్ని ఆకట్టుకున్న అంకుర సంస్థల్లో అగ్రిస్టార్టప్స్‌ వాటా ఒకశాతం లోపే! ఈ అవరోధాలేవీ అగ్రిప్రెన్యూర్స్‌ను భయపెట్టడం లేదు. కొత్త ఉత్సాహంతో, కొత్త ఆవిష్కరణలతో కొత్తతరం రంగంలోకి దిగుతూనే ఉంది. సేద్యంతో పోలిస్తే అవన్నీ...పెద్దగీత పక్కన చిన్నగీతలే - అన్న గుండెధైర్యం కావచ్చు. వేయి సవాళ్లు ఉన్నాయంటే, వేయి అవకాశాలూ ఉన్నట్టే అన్న ఆశావాదం కావచ్చు. అన్నిటికీ మించి రైతు మీదున్న అపారమైన ప్రేమ కావచ్చు.
సెంటర్‌ ఫర్‌ అగ్రి ఇన్నొవేషన్‌
జాతీయ వ్యవసాయ పరిశోధనా యాజమాన్య సంస్థ (నార్మ్‌)...వ్యవసాయ ఆవిష్కర్తలనూ శాస్త్రవేత్తలనూ అనుసంధానిస్తూ ఏర్పాటు చేసిన వేదిక. ఆవిష్కర్తలకు డాక్యుమెంటేషన్‌ నుంచి పేటెంట్‌ వరకూ ప్రతి దశలోనూ అండగా నిలుస్తుంది. ఇందుకు ప్రత్యేకంగా సెంటర్‌ ఫర్‌ అగ్రి ఇన్నొవేషన్‌ పేరుతో ఓ సంస్థను ప్రారంభించింది. ఈమధ్య ముప్ఫైమందికి పైగా గ్రామీణ ఆవిష్కర్తల్ని సత్కరించింది.
అగ్రిబిజినెస్‌ అండ్‌ ఇన్నొవేషన్‌ ప్లాట్‌ఫామ్‌
చక్కని మార్కెట్‌ అవకాశాలున్న ఆలోచనలకు అండగా నిలుస్తుంది, బ్యాంకుల నుంచీ వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థల నుంచీ నిధుల సేకరణలో సాయపడుతుంది. అవసరమైతే ఆ ఐడియాకు మెరుగులు దిద్దుతుంది, అంతిమంగా వినియోగదారుల దాకా తీసుకెళ్తుంది. ఈ సంస్థ ద్వారా చాలా అంకుర సంస్థలే మొగ్గ తొడిగాయి. కొత్త ఆలోచనల్ని స్వాగతిస్తూ తరచూ అగ్రిబిజినెస్‌ ఇన్వెస్టర్స్‌ క్యాంప్స్‌ నిర్వహిస్తుంది. ఇక్రిశాట్‌ అనుబంధ విభాగమిది.
నేషనల్‌ ఇన్నొవేషన్‌ ఫౌండేషన్‌
ఈ సంస్థ వ్యవసాయ ఆవిష్కరణలకూ, అందులోనూ గ్రామీణ సృజనకు ప్రోత్సాహం అందిస్తుంది. వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయ విధానాలు, కొత్త వంగడాలు...ఇలా రైతు శ్రమను తగ్గించి, పంట దిగుబడిని పెంచే ఏ కొత్త ఆలోచననైనా స్వాగతిస్తుంది. అవసరమైతే, మేధోపరమైన హక్కుల సంరక్షణలో సహకారం అందిస్తుంది. గతంలో ఎలాంటి ఆర్థిక ప్రోత్సాహకాలూ అందుకోని కొత్త ఐడియాల కోసం తరచూ పోటీల్ని నిర్వహిస్తోంది. బహుమతుల విలువ ఏడున్నర లక్షల రూపాయల వరకూ ఉంటుంది.
సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్స్‌ పార్క్‌
విద్యార్థులూ, వృత్తి నిపుణులూ, సాధారణ ప్రజల్లో వచ్చే కొత్త ఆలోచనలకు రూపమిచ్చేందుకు తన వంతు సహకారం అందిస్తుంది. గతంలో దీన్ని ‘టెక్నోప్రెన్యూర్‌ ప్రమోషన్‌ ప్రోగ్రామ్‌’ అని పిలిచేవారు. నిబంధనల్ని సంతృప్తిపరచగలిగితే, ప్రాజెక్టు వ్యయంలో యాభైశాతం దాకా అందిస్తుంది. వ్యవసాయంతో పాటూ పచ్చదనానికి సాయపడే, పర్యావరణానికి ఉపయోగపడే సాంకేతికతను ప్రోత్సహిస్తుంది.
పల్లె సైంటిస్టులు!
రైతు కష్టం ఇంకో రైతుకే బాగా తెలుస్తుంది. రైతు అవసరాన్ని మరో రైతే లోతుగా అర్థం చేసుకోగలడు.ఆ రైతే ఆవిష్కర్త అయితే ఇక తిరుగేం ఉంటుంది? ఉద్యాన పంటల్లో కలుపు అన్నది చికాకు కలిగించే సమస్య. వరంగల్‌ జిల్లాకు చెందిన మహీపాల్‌చారి తన అనుభవంతో కలుపు తీసే యంత్రాన్ని కనిపెట్టాడు. తయారీ ఖర్చు కూడా ముప్ఫైవేలలోపే. గుంటూరు జిల్లా పెదనందిపాడు రైతు సుభానీ చకచకా పిచికారీ చేయడానికి వీలుగా ఓ యంత్రాన్ని ఆవిష్కరించాడు. పదంటే పది నిమిషాల్లో ఓ హెక్టారు పొలానికి మందు కొట్టేయవచ్చు. నల్లగొండ బిడ్డ పుల్లారెడ్డికి ఒకే మోటారుతో రెండు వేరువేరు బావుల్లోని బోర్లను ఎందుకు పనిచేయించలేమన్న ఆలోచన వచ్చింది. వెంటనే, ఓ కొత్త యంత్రాన్ని రూపొందించాడు. ఆదివాసీ రైతు రాథోడ్‌ అయితే, సైకిలుతోనే కుంటలోంచో, చెరువులోంచో నీటిని తోడే వ్యవస్థను కనిపెట్టాడు. ‘తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది గ్రామీణ ఆవిష్కర్తలు ఉన్నారు. చాలామందికి రుణాలు ఇవ్వడానికి ఏ బ్యాంకులూ ముందుకు రావడం లేదు. ఆ దుస్థితి పోవాలి. దేశ భవిష్యత్తు ఆవిష్కరణల మీదే ఆధారపడి ఉంది’ అంటారు ‘పల్లెసృజన’ అధ్యక్షులు బ్రిగేడియర్‌ పోగుల గణేశం (రిటైర్డ్‌). ‘పల్లెసృజన’ గ్రామీణ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది.


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---






No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list