పెళ్లిచూపులు
Pelli Chupulu
+++++++++ పెళ్లిచూపులు+++++++
యుక్త వయసులోకి వచ్చిన యువతీ యువకులు పెద్దల సమక్షంలో ఒకరిని ఒకరు చూసి ఇష్టపడటానికి ఒకప్పుడు 'పెళ్లిచూపులు' మినహా మరోమార్గం వుండేది కాదు. పెళ్లిళ్ల పేరయ్య ద్వారా గానీ ... తెలిసినవాళ్ల ద్వారా గాని సంబంధాలు ఎక్కడ వున్నాయో అమ్మాయిల తల్లిదండ్రులు తెలుసుకునే వాళ్లు. సగోత్రికులు ఒకే సమూహానికి చెందినవారవుతారని పెద్దలు చెప్పిన కారణంగా, వాళ్ల మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండకూడదనే ఆచారాన్ని తప్పక పాటించేవాళ్లు.
తమ అమ్మాయికి తగినవాడనీ ... వాళ్లతో తాము తూగగలమని అనుకున్న తరువాతనే అబ్బాయి ఇంటికి వెళ్లి పెళ్లిచూపులకు ఆహ్వానించడం జరిగేది. అబ్బాయి తీరు ... అమ్మాయి ధోరణి ... ఇరుకుటుంబాలవారి పద్ధతులు పెళ్లిచూపుల్లోనే తెలిసిపోయేవి ... తేలిపోయేవి. ఇక అమ్మాయిని మాట్లాడమనీ ... నవ్వమని ... నడవమని ... పాడమని అడిగేవాళ్లు. అమ్మాయికి వంట ఎలా చేస్తుందని తెలుసుకునే వాళ్లు.
అయితే ఇదంతా అమ్మాయిని అవమానపరచాలనే ఉద్దేశంతో చేసే వాళ్లు కాదు. 'ఇంటికి దీపం ఇల్లాలే' అనే మాటను అప్పట్లో నూటికి నూరుశాతం నమ్మేవాళ్లు. తమ తరువాత తమ కుటుంబాన్ని చక్కదిద్దే నేర్పు .. ఓర్పు .. ఉందా లేదా అనే పెద్దవాళ్లు ఆలోచించేవాళ్లు. ఎవరైనా తమ ఇంటికి వస్తే ఎలా వ్యవహరిస్తుందనే ఉద్దేశంతోనే మాటతీరును పరిశీలించే వాళ్లు. కోడలు నట్టింట్లో నడుస్తుంటే లక్ష్మీదేవి నడుస్తున్నట్టుగా వుండాలని నడకతీరును చూసేవాళ్లు. ఇక ఏదైనా ఒక కళలో ప్రవేశం వుంటే, అది ఆ ఇల్లాలికి మరింత శోభను పెంచుతుందని ఆశించేవాళ్లు.
ఈ కాలంలో అమ్మాయి ఏ ఉద్యోగం చేస్తోంది ... ఎంత సంపాదిస్తోంది అని చూస్తున్నారు గానీ, ఒకప్పుడు .. తమ కుటుంబ పరువుప్రతిష్ఠలను కొత్తగా రానున్న కోడలు ఎంతవరకూ కాపాడగలదనే చూసేవాళ్లు. అలా ప్రాచీనకాలం నుంచి వస్తోన్న 'పెళ్లిచూపులు' అనే ఒక ఆచారం వలన, తగిన జీవిత భాగస్వామిని ఎంచుకుని పెళ్లితో కొత్త జీవితానికి శ్రీకారం చుట్టేవాళ్లు. నేటి ఆధునిక కాలంలోనూ సంప్రదాయ బద్ధమైన పెళ్లిచూపులను ఏర్పాటు చేయడానికే చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.
ఎందుకంటే ఇరుకుటుంబాల వాళ్లు ఒకరినొకరు దగ్గర నుంచి చూసుకోవడానికీ ... అర్థం చేసుకోవడానికి ఈ విధానం ఎంతో ఉపయోగపడుతూ వుంటుంది. వైవాహిక జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కొనసాగడంలో ఇదే ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. అందువల్లనే పూర్వీకులు పెళ్లిచూపులకు ఆచార సంప్రదాయాల్లో ఒక బలమైన స్థానాన్ని కల్పించారని చెప్పుకోవచ్చు.
మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
ఈ క్రింది లింక్ క్లిక్ చేసి PDF ఫైల్ పొందవచ్చును
---LIKE US TO FOLLOW:
---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565