MohanPublications Print Books Online store clik Here Devullu.com

జలప్రసాదం, Jalaprasadam

 జలప్రసాదం
Jalaprasadam


++++++++ జలప్రసాదం +++++++
నీటిని ‘ప్రవహించే బంగారం’గా వర్ణిస్తారు పెద్దలు. మానవాళి ఉనికి, నాగరికత నీటిపైనే ఆధారపడి ఉన్నాయి. రుతువులకు అనుగుణంగా వర్షాలు కురిస్తే, పుడమి సస్యశ్యామలమవుతుంది. నదులు జలకళ సంతరించుకుంటాయి. రుతువుల్లో అసమతౌల్యం ఏర్పడితే, వరదలు కరవు కాటకాలు దాపురిస్తాయి.
ఒకసారి దక్షిణ భారతాన తీవ్రమైన కరవు ఏర్పడింది. తాగేందుకు గుక్కెడు నీరైనా దొరకని దుర్భర పరిస్థితి నెలకొంది. ఆ పరిస్థితి చూసి చలించిపోయిన ‘శయనుడు’ అనే మహర్షి శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాక దుర్భర కరవు గురించి చెప్పి, దాన్ని నివారించమని కోరాడు.సమస్యను పరిష్కరించాలని గంగను శివుడు ఆజ్ఞాపించాడు. ఆమె వెంటనే తన అంశను భువికి పంపింది. ఆ అంశే ‘కావేరి’గా మారింది. దక్షిణ గంగగా ప్రసిద్ధి చెందింది. తమిళనాట కావేరిని ‘పొన్ని’ అని పిలుస్తారు. పొన్ని అంటే బంగారం లేదా ధాన్యం అని అర్థం. నది పరీవాహక ప్రాంతమంతా ధాన్యపు సిరితో కళకళలాడుతుంది కాబట్టి ‘బంగారునది’గా పిలుస్తారు.
పంచభూతాల్లో ‘జలం’ అత్యంత ప్రాధాన్యం కలిగింది. శివుడు జలాభిషేక ప్రియుడు. మహావిష్ణువు- భక్తితో తనకు ఒక్క నీటిబొట్టు సమర్పించినా చాలునంటాడు. నారం అంటే నీరు. నీటిలో నివాసిగా మహావిష్ణువు ఉంటాడు కాబట్టి ఆయనకు ‘నారాయణుడు’ అనే పేరు వచ్చింది.
గంగను భువిపైకి తెచ్చే ప్రయత్నంలో భగీరథుడు ఎదుర్కొన్న ఆటంకాలు, అవరోధాలు అన్నీ ఇన్నీ కావు. ఆయన మహాసాధకుడు. పట్టిన పట్టు విడవకుండా, పరమేశ్వరుణ్ని మెప్పించి గంగను భువిపైకి తెచ్చాడు. ఉప్పొంగుతూ ఉరకలు పెట్టే గంగ- శాంతగంభీర స్థాయిని పొందింది. భువిపై నదులెన్ని ఉన్నా, గంగదే అగ్రస్థానం.
అరణ్యవాస సందర్భంలో సీతారాములు గంగ, యమునలను స్తుతించినట్లు శ్రీమద్రామాయణం చెబుతోంది. రావణ సంహారం అనంతరం సీతారాములు అయోధ్యకు తిరిగి పయనమవుతూ, భరద్వాజ ముని ఆశ్రమంలో ఆగుతారు. ‘రుషులకు రాక్షస బాధ లేకుండా చేశావు శ్రీరామా! ఏదైనా వరం కోరుకో... ఇస్తాను’ అంటాడు భరద్వాజ మహర్షి. ‘వరాలేమీ వద్దు మహర్షీ! అయోధ్యా నగరం ఎప్పుడూ ఫల పుష్ప వనాలతో, స్వచ్ఛమైన జలాలతో, దీవులతో విలసిల్లేట్లు అనుగ్రహించండి చాలు’ అంటాడు శ్రీరాముడు.
గోదావరి నదీజలాలతో సీతారాములకు ఉన్న అనుబంధం ఇంకా ఎక్కువ. గోదావరి తీరమే పర్ణశాల. భద్రుడిపై వెలసి రాముడు ‘భద్రాద్రి నిలయుడు’గా మారింది గోదావరి తీరంలోనే!
వసుదేవుడు శ్రీకృష్ణుణ్ని రేపల్లెకు చేర్చేందుకు వీలుగా, రెండుగా చీలి దారిచ్చింది యమున. ఆపై శ్రీకృష్ణుడి బాల్యక్రీడలన్నీ యమునాతీరంలోనే.
కరవు కాటేస్తున్నప్పుడు, ప్రతి నీటిబిందువూ అమృతంతో సమానమే. నదీతీరాన భీష్ముడు అంపశయ్యపై ఉన్నప్పుడు, ఆయన దాహం తీర్చేందుకు ప్రయత్నిస్తాడు అర్జునుడు. బాణప్రయోగంతో పాతాళగంగనే పైకి రప్పిస్తాడు.
నదీజలాలు నిత్య స్మరణీయాలు. గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి నదుల్ని- నిత్యకర్మలు, అనుష్ఠానాలు నిర్వహించుకునే వేళ తప్పనిసరిగా స్మరిస్తారు.
ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు, జలాశయం లేదా నది ఎదురైతే నమస్కరించి- దేవతలను, రుషులను, పితృదేవతలను స్మరించుకోవాలంటుంది శాస్త్రవాక్యం.
శ్రీకృష్ణదేవరాయలు, శివాజీ- జలానికి, జల నిల్వ పద్ధతులకు ఎంతో ప్రాధాన్యమిచ్చారు. కుంటలు, చెరువులు తవ్వించారు. వాన నీటిని వ్యర్థంగా పోనివ్వకుండా అనేక పద్ధతులు పాటించారు. అడవుల్లోనూ వన్యప్రాణుల దాహార్తి తీర్చడానికి కుంటలు తవ్వించారు.
మానవ తప్పిదాలు, భౌగోళిక-వాతావరణ మార్పుల వల్ల నేడు జీవనదులు కాలువల్లా మారుతున్నాయి. పలు కాలుష్యాల కోరల్లో చిక్కుకున్నాయి.
జల సంరక్షణ ప్రతి ఒక్కరి ప్రధాన కర్తవ్యం. జలప్రసాదాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి నీటిచుక్కా బంగారమే!
- దానం శివప్రసాదరావు


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---

No comments:

Post a comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list