రాగిపాత్ర విశిష్టత
About Copper Plate
++++++++++:రాగిపాత్ర విశిష్టత:+++++++++
ప్రపంచంలో మనకు కనిపిస్తున్న లోహాలలో ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అవి దైవానికి ప్రతిరూపాలుగా కూడా చెబుతారు. సువర్ణం ఈశ్వర సంబంధమైనది. తామ్రం విష్ణు సంబంధమైనది. తామ్రం (రాగి) విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. బంగారము, వెండి, కంచు లాంటి ఇతర లోహాలు ఎన్ని ఉన్నా రాగి అన్నా, రాగితో చేసిన పాత్రలన్నా శ్రీమహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనవి అనే విషయాన్ని రుజువు చేస్తోంది వరాహపురాణం. ఈ పురాణంలోని నూట అరవై ఎనిమిదో అధ్యాయంలో సాక్షాత్తూ వరాహ రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువే భూదేవికి ఈ విషయాన్ని వివరించాడు.
భూదేవి ఓ రోజున శ్రీమహావిష్ణువును ఏ పాత్రలో నైవేద్యం పెడితే ఆయనకు ఇష్టమో చెప్పమని కోరింది. అప్పుడు ఆయన చాలామంది తనకు బంగారు, వెండి, కంచు పాత్రలలో నైవేద్యం పెడుతుంటారని, కానీ తనకు రాగి పాత్ర అంటేనే ఎంతో ఇష్టమని చెప్పాడు. దానికి ఓ కారణం ఉందని కూడా వివరించాడు.
పూర్వం రాక్షసులలో గూడాకేశుడు అనే ఓ రాక్షసుడుండేవాడు. అతడు రాక్షసుడైనా దుర్మార్గపు బుద్ధి లేకుండా దైవచింతనతో ప్రవర్తిస్తూ శ్రీమహావిష్ణువునే నిరంతరం ఆరాధిస్తూ ఉండేవాడు. అలా ధర్మకాముడై నిశ్చలబుద్ధితో పదహారు వేల సంవత్సరాలపాటు గూడాకేశుడు విష్ణువు గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఏమికావాలో కోరుకోమన్నాడు. అప్పుడా అసురుడు తనకు వేరే ఏమీ అక్కరలేదని వేల జన్మల పాటు విష్ణుభక్తి తనకు ఉండేలా అనుగ్రహించమన్నాడు. అంతేకాక శ్రీమహావిష్ణువు విడిచిన చక్రం వల్ల తనకు మరణం కలగాలని అప్పుడు తన శరీరమంతా రాగి లోహంగా మారిపోవాలని కోరుకున్నాడు. ఆ పరిశుద్ధమైన లోహంతో తయారైన పాత్రలో ప్రతినిత్యం శ్రీమహావిష్ణువుకు నైవేద్యం అందేలా వరమివ్వమని గూడాకేశుడు విష్ణువును ప్రార్థించాడు. గూడాకేశుడిని విష్ణువు అలాగేనని అనుగ్రహించి అంతర్థానమయ్యాడు. ఆ తరువాత కూడా ఆ రాక్షసుడు తపస్సు చేస్తూనే ఉన్నాడు.
వైశాఖశుద్ధ ద్వాదశినాడు శ్రీమహావిష్ణువు ఆ అసురుడి కోరిక తీర్చాలనుకున్నాడు. గూడాకేశుడు కూడా తనకు అంతటి భాగ్యం ఎప్పుడు కలుగుతుందా అని ఎదురుచూస్తూనే ఉన్నాడు. అతడిలోని నిర్మలభక్తికి మెచ్చిన విష్ణువు వైశాఖ శుద్ధ ద్వాదశినాడు సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తున్న సమయంలో విష్ణువు తన చక్రాన్ని ప్రయోగించాడు. వెంటనే అది అతడిని ఖండించింది. అతడి మాంసమంతా తామ్రం అయింది. అతడి శరీరంలోని అస్థులు వెండి అయ్యాయి. మలినాలు కంచులోహంగా అయ్యాయి. తనను జీవితాంతం అలా స్మరిస్తూ ఉన్న భక్తుడి కోరికను తీర్చాడు విష్ణువు. గూడాకేశుడి శరీరంనుంచి ఏర్పడిన తామ్ర లోహంతో ఒక పాత్ర తయారయింది. ఆ పాత్రలో పెట్టిన నైవేద్యమంటే విష్ణువుకు మహా ప్రీతికరమైంది. ఆ తరువాత తరువాత భక్తులెవరైనా రాగిపాత్రలో పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే విష్ణువు ఆనందంతో స్వీకరించసాగాడు.
రాగి పాత్రలోని నైవేద్యంలో ఎన్ని మెతుకులు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలపాటు ఆ నైవేద్యాన్ని పెట్టిన భక్తుడు తన లోకంలో ఉండగలడని శ్రీమహావిష్ణువు భూదేవితో చెప్పాడు. రాగి లోహాన్ని గురించి విశేషంగా చెప్పిన కథ ఇది. ఆరోగ్య శాస్త్ర రిత్యా పరిశీలించి చూసినా రాత్రి పూట రాగిపాత్రలో పోసివుంచిన నీటిని ఉదయాన్నే లేవగానే తాగిన వారికి రక్తశుద్ధి జరుగుతుందని, ఆరోగ్యకరంగా ఉంటుందని ఈనాడు కూడా అనుభవజ్ఞులెందరెందరో చెబుతున్నారు.
మూలశంక, జ్వరము, రక్తపిత్తము, శోధ (వాపులు), కుష్టము, శరీరము లావెక్కుట మొదలగు రోగాలు రావు. వార్ధక్య లక్షణములు లేక మానవుడు 100 సంవత్సరములు ఆరోగ్యముగా జీవించును. అటులే ముక్కు రంధ్రములను 300 మీ.లీ. నీటిని పీల్చి శుభ్రము చెసుకొన వలయును. ఈ విధముగా చేయుట వలన పడిశం, తుమ్ములు, దగ్గు, ముక్కులో వచ్చే వ్యాధులు తగ్గును. ఈ క్రియను యోగ, ప్రకృతి చికిత్సల్లో నేటికినీ చేయుచున్నారు వారమునకు ఒకసారి నువ్వుల నూనెతో తైలమర్దన చేయుటవలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా తామ్రలోహం ఇతర లోహాల కన్నా ఎంతో విశిష్టమైనదని పురాణ వాజ్ఞ్మయం పేర్కొంటోంది.
మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
ఈ క్రింది లింక్ క్లిక్ చేసి PDF ఫైల్ పొందవచ్చును
---LIKE US TO FOLLOW: ---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565