MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఆకాశమే హద్దుగా...ప్రస్థానం, Prasthanam

ఆకాశమే హద్దుగా...ప్రస్థానం
Prasthanam

++++++ఆకాశమే హద్దుగా...ప్రస్థానం! +++++
భగవంతుడు భావ ప్రియుడన్నది ఆర్యోక్తి. పవిత్ర భావ పరంపరగా భక్తి అలరారుతుంది. వేషభాషలకు, సంపదకు అతీతమైనది భక్తిభావం. చరిత్ర పుటలు పరిశీలిస్తే, ఒక్కో భక్తుడు ఒక్కో పంథాను అనుసరించి దైవంపై భక్తిని చాటడం కనిపిస్తుంది.
భక్తిమార్గం నిర్ణీత పద్ధతిలోనే కొనసాగాలన్న నియమం లేదు. అన్నమయ్య తన భక్తిని పదాల్లో కూర్చి పాడుకొని, వాగ్గేయకారుడిగా జగద్విఖ్యాతి చెందాడు. బమ్మెరపోతన తన మహాభాగవత కావ్యాన్ని శ్రీరాముడికి తప్ప, మానవమాత్రుడైన మహారాజుకు అంకితమివ్వడం తగదని భావించాడు. కుచేలుడు మొదట సందేహించినా, తన బాల్యసఖుడైన శ్రీకృష్ణుడికి పిడికెడు అటుకులు సమర్పించడానికి సిగ్గుపడలేదు. భక్తశిరోమణులందరూ త్రికరణ శుద్ధితో ఓ క్రతువుగా భక్తిభావాన్ని ప్రదర్శించి తరించారు.
భక్తి పరమార్థం బ్రహ్మానందాన్ని పొందడం. త్యాగయ్య వంటి వాగ్గేయకారులు, నమ్మిన దైవంపై తాము కూర్చిన పాటలు పాడుకుంటూ ఆత్మానందం అనుభవించారు.
వ్యసనాల వల్ల కలిగే ఆనందం అసలైనది కాదు. అదో భ్రాంతి! కొద్ది విరామం తరవాత, వ్యసనపరుల ఆనందం ఆవిరైపోతుంది. కొందరు దీర్ఘకాల దుఃఖంలో మునిగిపోతారు. దేహారోగ్యం, మానసిక ఆరోగ్యమూ చెడి నిర్లిప్త భావసమాధిలో కూరుకుపోయేలా చేస్తుంది... వారి వ్యసన కాముకత్వం. అలాంటివాళ్లు మళ్లీ ఆనందం పొందాలంటే దైవ మార్గంలోకి ప్రవేశించడమే పరిష్కారం! చేసిన పాపాలకు పరితాపం చెందడం, తిరిగి దుష్కార్యాలు చేయనని ప్రతినబూని అందుకు కట్టుబడి ఉండటం వల్ల- వారి జీవితాల్లో నెమ్మదిగా ఆనందం చోటు చేసుకుంటుంది. వ్యాకులపడినవారి మనసులు సేదదీరతాయి. సద్భావనా పరంపర అలా కొనసాగితే, వారి గతజీవిత బాధాకర అనుభవాలు బాధించడం తగ్గుతుంది.
సత్కర్మలు- ఆనందాన్ని వెంటతెచ్చే యోగ్యమైన ప్రక్రియలు. నమ్మకంతో చేసే ప్రతి నామస్మరణా జగత్పిత ఆరాధనే అవుతుంది. ఐహిక సుఖాల్లో మునిగి తేలుతున్నప్పుడు, ఆ అదృష్టం తన గొప్పతనం వల్లనే ప్రాప్తించిందని భావించకూడదు. నారాయణ పాద చలువ కారణంగానే ఆ అనుభవాలు లభిస్తున్నాయన్న జాగృతి వల్ల, భౌతిక సుఖానుభవం శాశ్వతం కాదన్న వివేకం సాధకుడిలో మేల్కొంటుంది. ఆ మేలుకొలుపు కష్టాల్లో సైతం వూరటనిస్తుంది. దుఃఖపరంపర కొనసాగే కాలంలోనూ భీతిలేని జీవితం అతడి సొంతమవుతుంది.
ఆశావహ దృక్పథం- మనిషిని నడిపించే దైవీగుణం! దైవచింతనతో కూడిన దృక్పథం వైపు మళ్లిన వ్యక్తి, ఆత్మశక్తిని రెట్టింపు చేసుకున్నవాడవుతాడు. అందువల్ల ఆత్మవిశ్వాసం పెరిగి లౌకిక వ్యవహారాలు సుగమమవుతాయి. సన్మార్గంలో ఆలోచించే మనిషి ఎదుటివారి గురించీ సానుకూలంగా యోచిస్తాడు. తోటి వ్యక్తిని గౌరవించడం వల్ల, వారి సహకారం పొందటం అతడికి తేలికవుతుంది. మనోనైర్మల్యం భగవత్‌ సాధనలో అంతర్భాగంగా మారి, మనిషికి తోడ్పడుతుంది.
పొరపాట్లు చేయడం మానవ సహజం. ఇహసంబంధమైన పనుల్లో దొర్లే పొరపాట్లు కొంత నష్టం తెచ్చిపెట్టినా, వాటిని సవరించుకొనే అవకాశం మనిషికి ఉంటుంది. శీలసంపదకు సంబంధించిన పొరపాట్లు ఆధ్యాత్మిక ప్రగతికి విఘాతం కలిగిస్తాయి.
భగవత్‌ వైభవాన్ని సాధించిన భక్తుల బాటను సాధకుడు అనుసరించాలి. ప్రపంచం మెచ్చే పవిత్ర మార్గాన్ని ఎంచుకొని ముందుకు సాగాల్సి ఉంది. విశ్వకర్త ప్రాపు కోసం పరితపించాలి. అప్పుడు ఓ భక్తుడిగా అతడు ఆశించినవి, ఆశించనివి సైతం లభిస్తాయి. లోతైన మానసంలో ఆకాశమంత ఆనందభాగ్యానికి నోచుకున్న అతడు సాక్షాత్తు భగవంతుడంతటివాడే అవుతాడు! - గోపాలుని రఘుపతిరావు


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---






No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list