MohanPublications Print Books Online store clik Here Devullu.com

నిర్భయం, Nirbhayam

 నిర్భయం
 Nirbhayam




+++++++++++ నిర్భయం ++++++++
‘చిత్తమెచట భయ శూన్యమో...’ అనే భావాన్ని వ్యక్తంచేసే ‘విశ్వకవి’ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ గీతం చాలా ప్రసిద్ధమైనది. భయం ఒక మానసిక స్థితి. మానసిక నియంత్రణకు లోబడి మనుషులు వ్యవహరిస్తారు. సాధారణంగా ప్రతి ఒక్కరినీ ఏదో ఒక భయం వెన్నాడుతుంటుంది. నెపోలియన్‌ హెల్‌ అనే రచయిత ఆరు ప్రాథమిక భయాల్ని గుర్తించారు. అవి: దారిద్య్రం, విమర్శ, అనారోగ్యం, ప్రేమరాహిత్యం, వృద్ధాప్యం, మృత్యువుకు సంబంధించిన భయాలు. మిగతా భయాలన్నీ వీటిలో అంతర్భాగాలని ఆయన సూత్రీకరించారు.
మృత్యుభయం అన్నింటి కంటే భయంకరమైంది. మృత్యువు కంటే దాని గురించిన భయమే అత్యంత ప్రమాదకరమైంది. మృత్యువు ఒక్కసారే చంపుతుంది. మృత్యుభయం ప్రతి క్షణమూ మనిషిని చంపుతూనే ఉంటుంది. తన కళ్లముందు అనేకమంది మరణిస్తుంటే, వారంతా ఎక్కడికి వెళుతున్నారని మథనపడుతుంటాడు. ఆ వైరాగ్యం క్షణికమే! మళ్లీ జీవితంపై కోరిక పుడుతుంటుంది. మృత్యువంటే భయమూ కలుగుతుంటుంది.
దారిద్య్ర భయం అతి వినాశకరమైంది. ఆ భయం హేతుబద్ధమైన దృష్టిని, వూహాశక్తిని, ఉత్సాహాన్ని నాశనం చేస్తుంది. మనిషి కష్టించి పనిచేసి, ఆర్జించినదానితో తృప్తిగా జీవిస్తే పేదరికం భయపెట్టదు.
చాలామందికి లోకుల విమర్శ అంటే భయం. నిర్ణయాలు, పనులు మంచివైనప్పుడు లోకం గురించి భయపడనక్కర్లేదు. మనసు చెప్పిన ప్రకారమే చేయాలి. ఉన్నత లక్ష్యానికి అనుగుణంగా నడుచుకోవాలి.
వృద్ధాప్యమంటే అందరికీ భయమే. వయసు పైబడుతున్న కొద్దీ, మరణానికి చేరువవుతున్నామన్న భయం ఎక్కువవుతుంది. మనిషి తన జ్ఞానాన్ని, వివేచనను, అనుభవాన్ని సమాజ సంక్షేమానికే ఉపయోగించాలి.
చాలామంది ఆరోగ్యాన్ని పట్టించుకోరు. అటువంటి అలక్ష్యం తగదు. అలా అని, లేనిపోని భయాలు పెట్టుకోకూడదు. ఎవరైనా తాను ఒంటరినని, ప్రేమించేవారు లేరని అనుకుంటే, అదే భయమై కుంగదీస్తుంది. మనిషి ఒక్కడే కావచ్చు. కానీ, ఒంటరివాడు కాదు. అతడి కోసం సమాజం ఉంది. తాను సమాజం కోసం ఉన్నానన్నదీ అతడు గుర్తించాలి.
‘సత్యవాదిగా, ఉదాత్తంగా, భయరహితంగా జీవించు’ అనేవారు గాంధీజీ. ఈ మాటలు ఠాగూర్‌ కవిత సారాంశాన్ని గుర్తుకు తెస్తాయి. ‘ప్రమాదాల నుంచి రక్షించాలని ప్రార్థించను. ఆ ప్రమాదాల్ని ఎదుర్కొనేలా, నాలోని భయాన్ని దూరం చేయమని ప్రార్థిస్తాను. నాకు బాధ లేకుండా చేయమని వేడుకోను. బాధను జయించే హృదయం ఇవ్వాలనే దైవాన్ని వేడుకుంటాను’ అనడంలో ఆయన నిర్భయత్వం కనిపిస్తుంది.
ఉపనిషత్తుల్లోని ఒక కథలో, నచికేతుడిది ముఖ్యమైన పాత్ర. యమ సదనానికి వెళ్లినా అతడు భయపడలేదు. మూడు రోజులు యముడి కోసమే అన్నపానీయాలు లేకుండా నిరీక్షించాడు. ఆయన్ని వరాలడిగాడు. మరణానంతరం ఏం జరుగుతుందో చెప్పాలని కోరాడు. నచికేతుడి నిర్భయత్వానికి యముడు సంతోషించాడు. స్వామి వివేకానంద ఒక సందర్భంలో ‘నాకు నచికేతుడి కంటే ఆత్మవిశ్వాసం కలిగిన యువకులు ఓ పదిమంది లభిస్తే చాలు. ఈ దేశ ప్రజల ఆలోచనల్ని, అన్వేషణల్ని సరికొత్త మార్గంలోకి మళ్లించగలను’ అని ప్రకటించారు. ఒక బాలుడికి ఉండాల్సిన గొప్ప లక్షణం భయరాహిత్యమని, అది నచికేతుడిలో పుష్కలంగా ఉందని స్వామి అనేవారు.
ప్రేమ వంటి సున్నిత భావాల్ని భయం నాశనం చేస్తుంది. నిద్రకూ దూరంగా ఉంచుతుంది. జీవితాన్ని దుఃఖమయంగా మారుస్తుంది. మనిషిలో ఆత్మవిశ్వాసం ఉంటే, భయాన్ని అది దూరం చేస్తుంది. అన్యాయం, అవినీతి, దుర్మార్గం పట్ల మనిషి ఓ హెచ్చరికగా ఉండాలి. అంతే తప్ప, భయం కూడదు. భయరాహిత్యమే మనిషి వ్యక్తిత్వానికి వన్నె తెచ్చే ఓ ముఖ్య లక్షణం! - డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---







No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list