MohanPublications Print Books Online store clik Here Devullu.com

అంతరంగం, AnthaRangam

అంతరంగం
 AnthaRangam

+++++++++అంతరంగం ++++++++
ప్రకృతిలోని వైవిధ్యాన్ని మనం గమనించినప్పుడు, వాటి ప్రయోజనాన్ని గ్రహించినప్పుడు- దేని ప్రాధాన్యం దానిదే అనే మూలసూత్రం అర్థమై ఆశ్చర్యపోతాం. ప్రతి వస్తువు, ప్రతి ప్రాణి మనిషంత ఉత్కృష్టత కలిగి ఉండాలంటే ఎలా? అప్పుడు అతడి మనుగడ ఆగిపోతుంది. వస్తువైనా, ఇతర ప్రాణి అయినా దేని కర్తవ్యాన్ని అది నిర్వహించినప్పుడే- మనిషి అత్యంత సౌకర్యంగా తన జన్మ ఉ ద్దేశాన్ని నిభాయించగలడు.
అలా అని, మనిషి తప్ప మిగిలిన జడాజడ వస్తుజాలమంతా అల్పమని కాదు. బంగాళదుంప కూరలో దుంపలొక్కటే కూరను రుచికరం చేయలేవు. నూనె, లవణం, మసాలాలు, మిగిలిన పదార్థాలు కలిస్తేనే ఆ కూర పూర్ణ మాధుర్యాన్ని సంతరించుకుంటుంది. తొంభై తొమ్మిది పైసలు రూపాయిలో పెద్దమొత్తమే కావచ్చు. మిగిలిన ఆ ఒక్క పైసా చేరితే తప్ప, రూపాయి పరిపూర్ణం కాదు. వైవిధ్యం, హెచ్చుతగ్గులు అన్నీ ప్రాణికోటి సౌఖ్యం, సౌలభ్యం కోసమే అని మనం గ్రహించగలిగితే- అహంకారాలు, ఆత్మన్యూనతలు ఉండవు. అవి అణగారిపోతాయి.
ఫలానావాళ్లే ఎందుకు గొప్పగా జన్మించాలి, మరికొందరు ఎందుకు అల్పులుగా జన్మించాలి? జన్మల్లోని అంతరాలు సృష్టిక్రమానికి అవసరం కావచ్చు ఫలానావాళ్లే ఎందుకు అలా, ఫలానావాళ్లే ఎందుకు ఇలా? అంటే... వారి వారి కర్మల ఫలితాలే అవన్నీ! జీవులు తమ కర్మఫలాల్ని అనుభవించే క్రమంలో, భగవంతుడి అపార కరుణ వెల్లడి అవుతుంది.
ఎనభై నాలుగు లక్షల జీవరాసులం... మనమంతా ఒక చెట్టులోని భాగాలం. మట్టిలోని కణాలం. ఇసుక మేటలోని రేణువులం. చెట్టులో వేర్లు, కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పూలు, పుప్పొడులు ఎన్నో ఉంటాయి. ఆ అన్నీ కలిస్తేనే చెట్టు. వాటిల్లో దేని పని దానిదే. దేని కర్తవ్యం అది నెరవేరిస్తేనే, చెట్టు పచ్చగా ఫలవంతంగా ఉంటుంది. లోకానికి తన వంతు ఫలసాయాన్ని అందజేస్తుంది. ప్రకృతిలోని ప్రతి వస్తువు, ప్రతి జీవి అంతే.
సమాజం సంతోషంగా, సజావుగా నడవాలంటే నిమ్నోన్నతాలతో సంబంధం లేకుండా మనిషి తన కర్తవ్య పాలన తాను చేయడం అవసరం. కాళ్ల పని కాళ్లుచేయాలి. అలా చేయకపోతే, మిగిలిన శరీరం స్తబ్ధంగా ఉండిపోతుంది. నోరు తన వంతు పనిగా ఆహారం తీసుకోకపోతే, మనిషి శరీర ప్రక్రియ స్తంభించిపోతుంది. ఇక్కడ పని విభజనే తప్ప, జీవుల ప్రాధాన్యాల ప్రసక్తే లేదు.
మనం ఎవరైనా ఎలాంటివాళ్లమైనా, ప్రాధాన్యక్రమంలో ఎంతగా ముందున్నా, లేదా చివరన ఉన్నా- అది సృష్టి సౌకర్యం కోసమే! అదంతా భగవంతుడి విభజనలోని దూరదృష్టి ఫలితం. అంతేకానీ, మనిషి సొంత శక్తిసామర్థ్యాలో, నైపుణ్యాలో కారణాలు కావు. అందువల్ల అతడు తన స్థాయి చూసుకొని సిగ్గుపడాల్సిన అవసరం, గర్వపడాల్సిన అగత్యం- రెండూ లేవు.
అమ్మ ప్రేమలోని సమానత్వమే తప్ప, ఆమె పంపకాల్లోని తేడాలేవీ మనిషి జీవితంలో ప్రాధాన్యం వహించవు. ఆమె తనకు ఎంతమంది సంతానమున్నా, అందరికీ తగినంత ఆహారాన్ని అందిస్తుంది. అంతేకానీ ఆ ఆహారంలోని విలువల్ని, రుచుల్ని ఎంతమాత్రం పరిగణించదు. బిడ్డల అభిరుచిని, అవసరాన్ని, ఆరోగ్యాన్ని తల్లి అంచనా వేస్తుంది. వారికి పంచే ప్రేమ విషయంలో, అవసరమైతే శిక్షించే విషయంలోనూ ఆమె ఈ నియమాన్నే పాటిస్తుంది. బిడ్డల శ్రేయం తప్ప అమ్మ దృష్టిలో మరో కోణం ఉండదు. భగవంతుడైనా అంతే!
సృష్టిని సౌందర్యభరితంగా, సౌకర్యవంతంగా రూపొందించేందుకు భగవంతుడు చేసిందే ఇదంతా! ఆయన రూపుదిద్దిన ఈ అన్ని తత్వాల వైరుధ్యాన్ని మనిషి సవ్యదృష్టితో చూడాలి. అడవిలోని ఉసిరికాయను, సముద్రంలోని ఉప్పును కలిపిన దేవుడి ఆలోచన ఏమిటో; అది ఏ రుచిని ఆవిష్కరించడానికో- గ్రహించాలి. సూర్యుడు ఉదయిస్తే తప్ప కమల హృదయం వికసించదు. అంతటి అనుబంధాన్ని కల్పించిన అంతర్యామి అంతరంగంలోకి మనిషి తొంగిచూడగలిగితే- ఈ సృష్టిలో అంతరం లేశమైనా లేదని అర్థమవుతుంది!
- చక్కిలం విజయలక్ష్మి


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---
No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం