MohanPublications Print Books Online store clik Here Devullu.com

శ్రవణానందం, Sravananandam

శ్రవణానందం
Sravananandam


++++++++ శ్రవణానందం +++++++
‘ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి’- ఇది పెద్దలు తరచూ చెప్పే మాట! మాట్లాడే ముందు మనిషి ఆలోచిస్తాడు. ఆ ఆలోచన- శబ్దరూపంలో బయటపడటమే మాట్లాట! అతడి లోపలి జ్ఞానం నుంచి ‘ఆలోచన’ పుడుతుంది. పూర్వకాలంలో ఎక్కువగా వినడం ద్వారా జ్ఞానం వచ్చేది.
వినకుండా, మాట్లాడకుండా మనిషి ఉండలేడు. అవి లేకుండా అతడి మనుగడ సాగదు. ఆ రెండింటిలో ఒకటి లేకుండా మరొకటి ఉండలేదు. మనిషి జీవితంలో ‘వినడం’ మొదటి ప్రాధాన్యం సంతరించుకుంటే, ‘మాట్లాడటం’- రెండో స్థానానికి చెందుతుంది. ‘మాట్లాట’తో పోలిస్తే ‘వినడం’ ఉన్నతమైనది. చిన్నప్పుడు పసిపిల్లలు అమ్మ మాటలు వింటారు. ఆ తరవాత మాట్లాడటం మొదలుపెడతారు. ప్రహ్లాదుడు తల్లిగర్భంలో ఉండగానే, నారద మహర్షి చెప్పిన విలువైన మాటలు విన్నాడు. అనంతరం జరిగిన ఆ ‘భక్త ప్రహ్లాద’ కథావిశేషం లోకమంతా ఎరిగినదే! న్యాయపరమైన తీర్పులు ఇచ్చేముందు- ఇరువర్గాల మాటలూ ‘వింటారు’. ఆ తరవాతే న్యాయమూర్తులు తీర్పు వెలువరిస్తారు.
జీవితంలో మనిషి వింటూనే జ్ఞానం పోగుచేసుకుంటాడు. సేకరించుకున్న ఆ జ్ఞానాన్ని ఇతరులకు మాటల రూపంలో పంచుతాడు. మంచిని విన్నప్పుడు మంచిమాటలే పలుకుతాం. అప్పుడా మంచి- వ్యక్తిని, వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. సమాజానికి దిశానిర్దేశం చేస్తుంది. వర్షకాలంలో చెరువు నిండుతుంది. తరవాత, పంటపొలాలకు నీరందిస్తుంది. జ్ఞానసిద్ధి పొందిన గురువులూ అంతే! వారి మాటల్ని శ్రద్ధగా విన్నప్పుడే, శిష్యులూ తమ గురువుల్లా తయారవుతారు.
వినడం అంటే, శక్తి పెంచుకోవడం! అది ధ్యానం చేయడం వంటిది. అనవసరంగా మాట్లాడటం, శక్తిని వృథా చేసుకోవడం కిందకే వస్తుంది. ప్రాథమికంగా, ‘మాట్లాట’- ధ్యానానికి పూర్తి విరుద్ధం. ఆత్మజ్ఞానులు అవసరమైతేనే తప్ప మాట్లాడరు. అందువల్ల యోగులకు ‘మునులు’ అని మరో పేరు. అంటే, మౌనంగా ఉండేవారని అర్థం!
మెహర్‌బాబా చాలా ఏళ్లు మౌనస్థితిలో ఉండిపోయారు. మౌనంలో ఉన్నప్పుడు దొరికే ఆనందం అంతా ఇంతా కాదు. మానవ జీవన యాత్రలో ఎంతో మేలు కలగజేసేది మౌనం. అందుకనే మౌనవ్రతానికి ప్రాచీనకాలంలో విస్తృత ప్రాశస్త్యం లభించింది. భారతదేశంలో ఇప్పటికీ ఆ సంప్రదాయం కొనసాగుతోంది.
ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినేవారి పట్ల గౌరవభావం పెరుగుతుంది. మాటకు అర్థం మాటలో ఉండదు. అది వినేవారి మనసు పొరల కింద దాగి ఉంటుంది. దాన్ని నిద్రలేపడమే మాట చేసే పని! మనసులో మరి ఏ ఇతర ఆలోచనా లేనప్పుడే ఇది జరుగుతుంది.
ఆలోచన అంటే- మనసు లోపల నిశ్శబ్దంగా జరిగే మాటల ఆట! అనవసర సమయాల్లో ‘మాట్లాట’ మంచిది కాదు. చరవాణిలో మాట్లాడుతూ వాహనాలు తోలితే ప్రమాదాలు సంభవిస్తాయి. వాటిని పసిగట్టడంలో, కొత్త ప్రమాదాల్ని అరికట్టడంలో ‘వినడం’ ప్రధానపాత్ర వహిస్తుంది. గుడ్డు లోపలి పిల్లకోడి పిలుపును విన్నప్పుడే, తల్లికోడి దాన్ని బయటి ప్రపంచానికి తీసుకువస్తుంది.
కాయకష్టం చేసేవాళ్లు, చేతివృత్తులవారు పగలంతా కష్టపడతారు. రాత్రిపూట గీతాలు వింటూ, శారీరక అలసట మరచిపోయి, మానసికానందంతో సేదతీరతారు. ఇదంతా వినడం వల్లనే! సత్సంగ సంప్రదాయంలోనూ ‘వినడం’ ఎక్కువ, మాట్లాడటం తక్కువగా ఉంటాయి.
ధ్యానంలో సాధకులు కళ్లు, నోరు మూసి ఉంచుతారు. కనుక చూడటం, మాట్లాడటం ఆగిపోతాయి. చెవులు మూయడం వీలుకాదు కాబట్టి, వినడం ఆగిపోదు. తెరచి ఉంచిన చెవులు ఏ శబ్దాన్నీ తిరస్కరించవు. చెట్ల కొమ్మల నుంచి టపటపమని లేచే పక్షుల రెక్కల చప్పుళ్లు, వాటి కిలకిలారావాలు.... వింటూ ఒక దశలో మనసు నిశ్చలమవుతుంది. ఆ క్షణాల్లో, సృష్ట్యాది అంతా ఉన్న ప్రణవనాదం చెవులకు వినిపిస్తుంది. అప్పుడే అసలైన శ్రవణానందం కలుగుతుంది. అదే సచ్చిదానందం!
- మునిమడుగుల రాజారావు


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---






No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list