MohanPublications Print Books Online store clik Here Devullu.com

పురాణాలు చెప్పిన ప్రకారం 28 నరకాలున్నాయి Narakam Lo Sikshalu

పురాణాలు చెప్పిన ప్రకారం 28 

నరకాలున్నాయి

Narakam Lo Sikshalu
+++++;పురాణాలు చెప్పిన ప్రకారం
28 నరకాలున్నాయి:++++++
నరక బాధలు వదలాలని కోరుకోవడంలోనే న్యాయం ఉందనిపిస్తుంది. ఎవడైనా, ఏదైనా చెయ్యకూడని పని చేస్తే నరకాలలో పడిపోతావుతా! అంటూ శాపనార్ధాలు పెట్టడం చేస్తూనే ఉన్నాం. పుత్ర సంతానం లేకపోతే పున్నామ నరకాల్లో కూలిపోతామని ఇప్పటికీ ఎందరో భయపడడాన్ని చూస్తున్నాం. ఎప్పుడు నరకం ప్రస్తావన వచ్చినా అందరికీ గుర్తొచ్చేది యమలోకం.
ఇంకా కాస్త లోతుకి దిగితే దాని యజమాని యముడు! మరి ఈ పున్నామ నరకాని, నరకాలు ఏమిటీ? అసలు మనకు ఎన్ని నరకాలున్నాయి? పురాణాలు చెప్పిన ప్రకారం 28 నరకాలున్నాయి. పాప స్వరూపాలను బట్టి యముడు ఆయా నరకాలకు పాపులను పంపుతూ ఉంటాడు.
1. తమిశ్రం: ఇతరుల సొమ్మును, భార్యాపిల్లలను కాజేసిన వాళ్ళను యమదూతలు కాలపాశంతో కట్టేసి ఇదో చిమ్మ చీకటి నరక కూపం అక్కడ పాపిని సొమ్మసిల్లి పడిపోయేదాకా కర్రతోకాని, కడ్డీతో కాని మెరకు తాళ్ళతో కానీ చావబాదుతారు. దెబ్బలకు తట్టుకోలేక గావు కేకలు పెట్టినా, చావుకేకలు పెట్టినా పట్టించుకోరు. తాగడానికి నీళ్ళు, తినడానికి తిండి ఇవ్వకుండా చితకబాదుతారు పాపి ఒకవేళ కళ్ళు తిరిగి పడిపోయినా వదలరు. స్పృహలోకి వచ్చాక ఈ శిక్షను తిరిగి అమలు చేస్తారు. ఇలా శిక్షాకాలం పూర్తయ్యేవరకు చావబాదుతూనే ఉంటారు.
2. అంథతమిశ్రం: ఒకరినొకరు మోసపుచ్చుకుని చిన్న నా పొట్ట నిండితే చాలు అనుకుంటూ స్వార్థ చింతనతో ముక్కుమునగ తినేవారిని, అవసరాలు తీరే వరకు భార్యను వాడుకొని ఆ తరువాత వెంట్రుకముక్కలో వదిలిపారేసే భార్యాభర్తలను శిక్షించేందుకు యముడు ఈ నరకానికి పంపుతాడు. నిష్కారణంగా విడాకులిచ్చే భార్యకు, భర్తకు కూడా ఇక్కడే శిక్షపడుతుంది. ఇదో భయంకరమైన చీకటి నరకం. ఇక్కడ కళ్ళుపొడుచుకున్నా ఏమీ కనబడదు. ఇక్కడకు వచ్చేలోపే పాపిని చితకొట్టేస్తారు. ఆ దెబ్బలకు దిమ్మతిరిగిపోయి ఉండగా పెడరెక్కలు విరిచికట్టి తెచ్చి ఇందులో పారేస్తారు.
3. రౌరవం: రురు అంటే భయంకరమైన విషనాగు అని అర్థం. శరీరం శాశ్వతమని తనకోసం, తనవారి కోసం ఇతరుల ఆస్తిపాస్తులను లాక్కుని అక్రమంగా అనుభవించే వాళ్ళు ఇక్కడికి వస్తారు. వీళ్ళ చేతిలో మోసపోయిన వాళ్ళు మిన్నాగులుగా మారి విషం కక్కుతూ మొర్రొమని మొత్తుకున్నా, ఇంతకన్నా చావేసుఖం మమ్మల్ని చంపేయండి అని ప్రాధేయపడినా వినకుండా ఘోరంగా హింసిస్తారు.
4. మహారౌరవం: న్యాయమైన వారసత్వాన్ని కాదని ఆస్తిపాస్తుల్ని అక్రమంగా లాక్కుని అనుభవించే వారిని, ఇతరుల భార్యను, ప్రేమికురాలిని అక్రమంగా లోబరచుకుని అనుభవించే వారు ఇక్కడకు వస్తారు. వీళ్ళను భయంకరమైన విషనాగులు చుట్టచుట్టుకుని మెలిపెట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వీటినే క్రవ్యాదులు అంటారు. ఆ బాధ భరించలేక విలవిలలాడిపోతుంటే, పాపిని చప్పరించుకుంటూ మింగుతాయి.
5. కుంభిపాకం: వేట ఒక ఆట అంటూ సాధు జంతువు లను కిరాతకంగా హతమార్చి, కడుపునింపుకునే వారు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఎప్పుడూ సలసలకాగే నూనె ఉంటుంది. అందులో పడేసి వేపుతారు.
6. కాలసూత్రం: ఈ నరకం కణకణలాడే రాగిపాత్రగా ఉంటుంది. పై నుంచి సూర్యుడు, కింద నుండి భగ్గున మండుతున్న మంటతో ఆ రాగి కొలిమి విపరీతంగా వేపెక్కి ఉంటుంది. తమ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించి వయసుడిగిపోయిన పెద్ద వారిని గౌరవించి ఆదరించని వాళ్ళు ఇక్కడకు వస్తారు. కూచోడానికి ఉండదు. నుంచోడానికి ఉండదు. తప్పించుకునే మార్గంలేని ఈ నరకంలో చచ్చేలా పరిగెత్తించి ఆ తర్వాత ఈడ్చి పారేస్తారు.
7. అసిత పత్రవనం: విద్యుత్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనుల్లో వేలుపెట్టి వాళ్ళనూ చెడగొట్టే వాళ్ళు ఇక్కడకు వస్తారు. అలాగే పెద్దలు చెప్పిన మార్గాన్ని కాదని సొంత కవిత్వం ప్రదర్శించి, ఇదే గొప్ప జీవితం అని వాధించేవాళ్లు కూడా ఈ నరకానికే వస్తారు. కత్తుల్లా మహా పదునుగా ఉండే ముళ్ళ చెట్లూ, రాళ్ళూ ఉండే నరకం ఇది. ఇక్కడ పాపిని కత్తులతో పొడుస్తూ, కర్రలతో కొడుతూ, పరుగులెత్తిస్తారు. ఒళ్ళంతా కోసుకుపోయి, చీరుకుపోయి పాపి హాహాకారాలు చేస్తున్నా వదలకుండా వెంటపడి హింసిస్తారు. పాపి స్పృహతప్పి పడిపోతే ఆగి, తెలివి వచ్చాకా మళ్ళీ కొడతారు. యముడు విధించిన శిక్ష పూర్తయ్యే దాకా ఈ శిక్ష అమలు జరుగుతుంది.
8. సుకరముఖం: అధికార దుర్వినియోగానికి పాల్పడి, అక్రమాలు అన్యాయాల్లో దిగబడి విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు, అధికారులు ఈ నరకానికి వస్తారు. ఇక్కడ వాళ్ళను చితకకొట్టి పచ్చడి పచ్చడి చేస్తారు. చెణకు గడను పిండి పిప్పిచేసినట్టే పాపిని భయంకరంగా శిక్షిస్తారు. తెలివి తప్పి పడిపోయినా ఉపేక్షించరు. తెలివి రాగానే ఈ శిక్ష మళ్ళీ అమలు జరుగుతుంది.
9. అంధకూపం: చిట్టి చీమను బుద్ధి పూర్వకంగా తొక్కిపెట్టి బాధించేవాళ్ళు, కాపాడమని ప్రేధేయపడే వారిని అవకాశం ఉండి కూడా కాపాడని వాళ్లు ఈ నర కానికి వస్తారు. అలాగే ఉత్తిపుణ్యానికి సాటి జీవుల్ని చంపిపారేసే వాళ్ళు కూడా ఇక్కడకు చేరతారు. వాళ్ళను పులులు, సింహాలు, గద్దలు, తేళ్ళు, పాములు నిండి ఉండే లోయలో పారేస్తారు. చేసిన పాపం పరిహారమయ్యే వరకు ఇవి అదే పనిగా దాడి చేస్తూ చంపుకు తింటాయి. ఎదుటి ప్రాణిని హింసిస్తే అవి ఎంతగా బాధపడతాయో తెలియడానికే యముడు ఈ నరకంలోనికి పాపులను నెడతాడు.
10. తప్తమూర్తి: ఈ నరకం ఒక కొలిమిలా ఉంటుంది. ఇక్కడ పెను మంటలు నాల్కలు సాచి భగ భగ మండుతూ ఉంటాయి. బంగారం, విలువైన రత్నాలు, రత్నా భరణాలు కాజేసిన వారిని ఇందులో పడేసి సజీవ దహనం చేస్తారు.
11. క్రిమి భోజనం: ఇది క్రిమి కీటకాలతో నిండి ఉండే నరకం. ఇంటికి అతిథులుగా వచ్చిన వాళ్ళను ఆదరించకుండా, వాళ్ళకు మెతుకు విదల్చకుండా మింగేవాళ్ళను, ఎదుటి వాళ్ళను సొంత పనులకు, స్వార్ధ ప్రయోజనాలకు వాడుకొని అవసరం తీరాకా విసిరి పారేసే వాళ్ళను ఇక్కడకు తీసుకువచ్చి క్రిమికీటకాలకు ఆహారంగా పడేస్తారు. అవి ఆవురావుమంటూ కండలు పీక్కుతింటాయి. ఇదో రకం చిత్రహింస. పాపి శరీరాన్ని పీక్కు తినడం పూర్తయినంత మాత్రాన వాడి పాపం తీరిపోయినట్టు కాదు. వాడికి మరో శరీరం ఇచ్చి శిక్షను తిరిగి అమలుచేస్తారు. ఇలా పాపి చేసిన పాపానికి శిక్షాకాలం పూర్తయ్యే వరకూ శరీరాలు ఇస్తూ ఈ శిక్ష విధిస్తూనే ఉంటారు.
12. శాల్మిలి: దీన్నే తప్త శాల్మిలి అని కూడా పిలుస్తారు. వావీ వరస పట్టించుకోకుండా అక్రమ సంబంధాలు ఎగబడే ఆడ, మగ వాళ్ళను ఈ నరకానికి తెస్తారు. ఇక్కడ కణ కణ మండే ఒక ఇనుపలోహ మూర్తి ఉంటుంది. ఒంటికి పట్టిన మదం ఒదిలిపోయే దాకా ఆ బొమ్మను కౌగిలించుకోవాలి. ఒళ్ళంతా భగ్గున మండిపోతున్నా వదలకుండా పాపిని ఈ బొమ్మను కౌగిలించుకునేలా చేస్తారు. పారిపోవడానికి ప్రయత్నిస్తే చితక బాది మరీ తీసుకువస్తారు.
13. వజ్రకంటకశాలి: జాతి రీతి లేకుండా జంతువులతోనూ , శృంగారం నడిపేవారికి ఈ నరకం ప్రత్యేకంగా సిద్ధంగా ఉంటుంది. అలాంటి వారిని ఏదును దేరిన వజ్రాలతో తయారు చేసిన బొమ్మ ఉంటుంది. ఇలాంటి వాళ్ళంతా దాన్ని కౌగిలించుకు తీరాలి. అలా కౌగిలించుకోగానే ఆ మొనదేరిన వజ్రాలు శరీరంలోకి దిగబడి ఒంటిని జల్లెడ చేస్తాయి. ఇక్కడ కత్తుల్లాంటి ముళ్ళున్న చెట్టు ఉంటుంది. ఆ చెట్టెక్కమని, అక్కణ్ణించి బరబరా కిందకు ఈడ్చేస్తారు. దాంతో ఒళ్ళంతా ఎక్కడికక్కడ తెగిపోతుంది.
Hella14. వైతరణి: అధికారాన్ని సద్వినియోగం చేసి. ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళు వాటిని పూర్తిగా దుర్వినియోగ పరిచి, అక్రమాలకు, అనుచితాలకు పాల్పడితే ఇక్కడకు వస్తారు. మరణం పొందిన వ్యక్తి పైలో కాలకు చేరాలంటే ఈ వైతరణి అడ్డంగా ఉంటుంది. దీన్ని దాటి వెళ్ళాలంటే ఎతో పుణ్యం చేసు కోవాలి. దీంట్లో పడకుండా బైట పడాలని చాలా మంది కోరుకుంటారు. ఇదొ భయంకరమైన నది. మల మూత్రాలు, చీము, నెత్తురు, ఉమ్మి, వెంట్రుకలు , ఎముకలు, మాంస ఖండాలు వంటివి మురిగి ముక్కిపోయి గబ్బు కంపుకొట్టె మహానది ఇది. చూడడానికే రోతగా, పరమ అసహ్యంగా ఉండే ఈ నదిలోకి క్రిమికీటకాల్లా బతుకుతూ, ఆనీరే తాగుతూ, అక్కడ దొరికేవే తిని శిక్షాకాలం గడపాల్సి ఉంటుంది.
15. పూయోదకం: వైతరణిలో ఉండే కాలుష్య జలమే ఈ నరకంలో ఒక బావిలో ఉంటుంది. వివాహం చేసుకునే ఉద్దేశ్యం లేకపోయినా, మాయమాటలు చెప్పి ఆడపిల్లను ముగ్గులోకి దింపి అనుభవించే పురుష పశువులకు ఈ నరకంలో శిక్ష పడుతుంది. ఇక్కడా ఆ పాపి బావిలో నీటినే తాగి బతకాల్సి ఉంటుంది.
16. ప్రాణరోధం: కుక్కలు వగైరా జంతువుల్ని వేటకు ఉసిగొల్పి సాధు జంతువుల ప్రాణాలు హరించే వారి కోసం ఈ నరకం తలుపులు తెరిచి ఉంటాయి. ఇక్కడ కృరజంతువులను వేటాడమని పాపి మీదికి వదులుతారు. అవి కండకొక ముక్కగా కొరుక్కు తింటుంటే, పాపి భయంకరమైన మరణవేదన పడతాడు.
17. వైశాశనం: పేదలు ఆకలి దప్పులతో బాధపడుతుంటే, తమ దర్పాన్ని ప్రదర్శించుకోవడానికి విందులు, వినోదాలు చేసుకుంటూ అవతలి వారు బాధపడు తుంటే చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్ళంతా ఈ నరకానికి వచ్చి పడతారు. మింగ మెతుకు ఇవ్వకుండా, తాగడానికి నీళ్ళు చుక్క కూడా ఇవ్వకుండా యమ భటులు మాత్రం పెద్ద ఎత్తున ఘుమ ఘుమలాడే వంటకాలు తింటూ పాపిని శారీరకంగా, మానసికంగా హింసిస్తారు. ఇక్కడున్నంత కాలం పాపి ఆకలిదప్పులతో మలమలామాడిపోతాడు.
18. లాల భక్షణం: అతి కాముకులు, భార్యను కట్టు బానిసగా కన్నా నీచంగా చూసే వాళ్ళు తన ఆధిక్యతను చాటుకోవడానికి వీర్యం తాగిస్తారు. ఇలాంటి వార్తలు తరచు వినబడుతుంటాయి. అలాంటి పొగరుబోతుల పని పట్టేందుకే ఈ నరకం ఉంది. అటువంటి వారిని ఇక్కడకు తెచ్చి వాడి వీర్యాన్నే కాదు మంది వీర్యాన్ని కూడా తాగిస్తారు. వీర్యపు సముద్రంలో పడేస్తారు. ఇందులో మునుగుతూ అదే తాగుతూ శిక్షాకాలం పూర్తి చేయాలి.
19. సారమేయాదిదానం: ఆహారంలో విషం కలిపేవాడు, ఊచకోతకు దిగేవాడు, దేశాన్ని సర్వనాశనం చేసేవాడు ఈ నరకానికి వస్తాడు. సామాజిక జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసే వారికి ఈ నరకంలో తినడానికి కుక్క మాంసం తప్ప మరేదీ దొరకదు. దాన్ని తిన్న వెంటనే ఆలోకంలో ఉండే కుక్కలు గుంపులు గుంపులుగా వచ్చి పడి, పాపి మాంసాన్ని పీక్కు తింటాయి.
20. అవీచి: నీటిబొట్టులేని నరకం ఇది. అక్కడ రాతి పలకలు పరుచుకున్న తీరు చూస్తే సముద్రమేదో ఉండే దోమో అనిపిస్తుంది. తప్పుడు సాక్ష్యం చెప్పే వాళ్ళను, వ్యాపార వ్యవహారాల్లో అబద్దాలు చెప్పి మోసం చేసే వాళ్ళను, తప్పుడు ప్రమాణాలు చేసే వాళ్ళను ఈ నరకానికి తీసుకువస్తారు. అందులో ఎంతో ఎతె్తైన కొండ ఉంటుంది. దాని మీద నుంచి కిందికి తోసేస్తారు. పాపి సముద్రంలో పడిపోతున్నానేమో అని కంగారు పడతాడు. కానీ కొండ కింద సముద్రం ఉండదు. రాతి పలకల మీదపడి ముక్కలు ముక్కలవుతాడు. కానీ చావడు. ఈ శిక్ష అదే పనిగా అమలు చేస్తారు.
21. అయోపానం: ఈ నరకం తాగుబోతుల కోసమే ఉంది. ఆడా, మగ తాగుబోతులకు వేరువేరుగా శిక్షలుంటాయి. పాపులు బతికి ఉండగా ఎన్నిసార్లు మద్యం పుచ్చుకున్నారో లెక్కలు తీసి అన్నిసార్లు ఈ శిక్షలు విధిస్తారు. ఆడ తాగుబోతు అయితే ఇనుప ద్రవాన్ని తాగాలి. మగ తాగుబోతు లావా తాగాలి. యజ్ఞ యాగాదుల్లో సోమపానం చేయడం ఆన వాయితి. ఆ ముసుగులో మద్యం పుచ్చుకునే వారికి కూడా ఇక్కడే శిక్ష పడుతుంది. యముడు స్వయంగా పాపి గుండెపై నించుని ఈ శిక్షను అమలు చేస్తాడు.
22. రక్షోభక్షం: జంతు బలిని, నర బలిని విచ్చలవిడిగా చేసి మాంసాన్ని ఇష్టానుసారంగా తినే వారి కోసం ఈ నరకం ఉంది. బలి పశువు ఎంత బాధ పడుతూ ప్రాణాలు వదులుతుందో అలాగే పాపి కూడా హింసపడుతూ మరణించే విధంగా వాడి చేతిలో బలైన పశువులు, మనుషులు వచ్చి పాపిని హింసించి, చండాడి కసి తీర్చుకుంటాయి.
23. శూలప్రోతం: ఎదుటి వాడు ఏ అపకారం చేయక పోయినా నిష్కారణంగా ప్రాణాలు తిసే వాళ్ళను, నమ్మకద్రోహం చేసేవాళ్ళను ఈ నరకానికి పంపు తారు. అక్కడ వాళ్ళను శూలానికి గుచ్చి వేలాడ దీస్తారు. భరించరాని ఆ బాధకుతోడు అన్నం పెట్టరు. తాగడానికి నీళ్లు ఇవ్వరు. దీనిక తోడు దెబ్బలతో హింసిస్తారు.
24. రకర్దమం: మంచి వాళ్ళ పట్ల అవమానకరంగా వ్యవహరించి దబాయించి బతికేసే వాళ్ళను ఈ నరకానికి తీసుకువస్తారు. వాళ్ళను తలక్రిందులుగా వేలాడ దీసి హింసిస్తారు.
25. దంద శూకం: తన తోటి మానవుల్ని జంతువుల్లా వేటాడటం, తక్కువ చూపు చూడటం, మానవ హక్కుల్ని హరించడం లాంటివి చేస్తాడో వాడు ఈ నరకానికి వస్తాడు. వాడు ఏ జంతువుల్ని హీనపరుస్తూ, సాటి మనిషిని వాటితో పోలుస్తూ హింసిస్తాడో, ఆ జంతువులు పాపిని చీల్చి చెండాడుతాయి.
26. వాతరోదం: అడవుల్లో చెట్లమీద, కొండ కొమ్మల్లో ఉంటూ ఎవ్వరి జోలికీ రాని జంతువుల్ని పట్టి పల్లార్చే వారు ఈ నరకానికి వస్తారు. అలాంటి వారిని నిప్పుతో కాల్చి, విషం ఇచ్చి, ఆయుధాలతో హింసిస్తారు.
27. పర్యావర్తనకం: ఆకలితో అలమటించే వాడు ఒక్క ముద్ద అన్నం పెట్టమని అడిగితే పెట్టకపోగా నానా దుర్భాషలాడే వాడిని ఈ నరకంలో పడేస్తారు. ఇక్కడికి రాగానే కాకులు, గద్దలు కళ్ళుపొడిచి ఎక్కడికీ పారిపోయే వీలు లేకుండా చేస్తాయి. ఆ తర్వాతీ రోజూ ముక్కలు ముక్కలుగా కండలూడదీస్తాయి.
28. సూచీముఖం: గర్వం, పిసినారి తనం ఉన్న వారిని, రోజు వారీ ఖర్చులకు కూడా డబ్బు తీయని వారినే, పరమ లోభులను ఇక్కడకు తీసుకువస్తారు. వీళ్ళు తమ కడుపు కోసం తినరు, ఇంకొకరికి పెట్టరు. అప్పు చేసి ఎగనామం పెట్టే వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు. ఇక్కడ పాపుల్ని నిరంతరం సూదులతో పొడుస్తారు. ఇవి కాక దుర్భుదం, నిర ర్భుదం, యెయెయె, హిహిన, ఉత్పల, పద్మ, మహా పద్మలని చల్లటి నరకాలు కూడా ఉన్నాయి. ఈ నరకాల్లో పడిన వాళ్ళు చలికి బిగుసుకుపోయి గడ్డకట్టుకుపోతారు.
సామాజిక జీవితాన్ని సవరించడానికి, వ్యక్తిగత జీవితాన్ని సంస్కరించడానికి ఈ నరకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఒక విషయాన్ని నయనగానీ, భయాన కానీ, చెప్పవచ్చునంటారు పెద్దలు. ఆశలు, ఆకర్షణలు రేకిత్తిస్తూ చెప్పే ఉపదేశాలు నయాన చెప్పేదైతే - నరకాలు. నరక బాధలు వగైరాలు భయాన చెప్పేవి. ఎటుదిరిగీ ప్రజల ప్రవర్తన బాగా ఉండాలని, వాళ్ల వల్ల సాటి మనుష్యులే కాదు ఇతర జీవజాలం కూడా ప్రశాంతంగా బతకాలనీ బలంతా కోరుకుని పెద్దలు ఏర్పరచినవి ఈ నరకాలు. పైన చెప్పిన వివరాల్లో వ్యష్టినిష్టను, సామాజిక నిష్టను పెంపొందింపజేసే అంశాలే చాలా కనబడతాయి.
రాముణ్ణి నమ్మినా, యముణ్ణి నమ్మినా ఫలితం సామాజిక సంక్షేమమే. పెద్దల ఆకాంక్షలు నెరవేరాలంటే మనమంతా క్రమశిక్షణ కలిగి కట్టుబాటుతో జీవించాలి. ఇన్ని రకాల నరకాలు లేకుండా పోతే అంతకన్నా పండుగ మరొకటి ఉంటుందా? బాధలు బాదరబందీ లేకుండా బతకడం కన్నా జీవితానికి వేరే ఆనందం ఏముంటుంది.



మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---





No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list