పంచాంగ భేదాలు,
Panchangam Bhedalu
+++++++పంచాంగ భేదాలు +++++++
ప్రస్తుతం వస్తున్న పంచాంగాలలో రెండు రకాల పంచాంగాలు ఉన్నాయి. పంచాంగ గణన పద్ధతిలో భేదం వల్ల ఈ విభజన జరిగినది. అవి దృక్సిద్ధాంత పంచాంగాలు, పూర్వ సిద్ధాంత పంచాంగాలు.
దృక్సిద్ధాంత పంచాంగాలు :- నూతన వేధశాలలో కనుగొన్న భూకేంద్రానికి సరిపడే వాస్తవిక రవి చంద్రులచే సాధింపబడిన తిధి, నక్షత్రం, యోగం, కరణం, గ్రహ సంచారాలు ఉండే పంచాంగాలను దృక్సిద్ధాంత పంచాంగాలు అంటారు. భారత ప్రభుత్వ రాష్ట్రీయ పంచాంగం దృక్సిద్ధ పంచాంగానికి మంచి ఉదాహరణ.
పిడపర్తి పంచాంగం, సుదర్శన పంచాంగం, కాలచక్ర పంచాంగం( శ్రీనివాస గార్గేయ), చిత్రాల గురుమూర్తి గుప్త పంచాంగం, కంచికామకోటి సుబ్రహ్మణ్య సిద్ధాన్తి (యల్.యస్.సిద్ధాన్తి) పంచాంగం మొదలైనవి దృక్సిద్ధాంత పంచాంగాలలో ప్రముఖమైనవి.
పూర్వ సిద్ధాంత పంచాంగాలు:- సూర్య సిద్ధాంతం ఆధారంగా చేసుకొని పూర్వకాలంలో రచించబడిన గణన గ్రంధాల ఆధారంగా రూపొందినవి పూర్వ పద్ధతి పంచాంగాలు. కొంతమంది అభిప్రాయాల ప్రకారం సాధారణంగా పురోహితులు పూర్వ సిద్ధాంత పంచాంగాలను, జ్యోతిష్యులు దృక్సిద్ధాంత పంచాంగాలను ఉపయోగిస్తుంటారు.
పిడపర్తి వారి పంచాంగం, తంగిరాల వారి పంచాంగం, నేమాని వారి పంచాంగం, బుట్టే వారి పంచాంగం, వంగివరపు వారి పంచాంగం, కప్పగంతుల వారి పంచాంగం మొదలుగునవి ప్రముఖంగా పూర్వ సిద్ధాంత పంచాంగాలుగా ప్రచారంలో ఉన్నవి.
భారత ప్రభుత్వ రాష్ట్రీయ పంచాంగం
భారత ప్రభుత్వం 1952 లో పంచాంగ సంస్కరణ కమిటీని ఏర్పాటు చేసి వారి సూచనల ప్రకారం ప్రామాణిక పంచాంగాన్ని రచించటానికి కలకత్తాలో పొజిషనల్ ఆస్ట్రానమీ సెంటర్ అనే సంస్ధను నెలకోల్పారు. ఆ సంస్ధ భారత వాతావరణ శాఖ క్రింద పనిచేస్తుంది. ఈ కేంద్రం భారతదేశంలోని ప్రధానమైన భాషలలో రాష్ట్రీయ పంచాంగాన్ని 1957-58 నుంచి ప్రచురిస్తున్నది.
దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న విభిన్న గణిత పద్ధతులను సమన్వయపరచి శాస్త్రీయమైన పంచాంగాన్ని రూపొందించటం ఈ రాష్ట్రీయ పంచాంగం ప్రచురణ ప్రధాన లక్ష్యం. క్రీ.శ 285 సంవత్సరంలో మార్చి 22 ఆదివారం సాయన నిరయణ రాశి చక్రాలు ఒకటయ్యాయి. నాడు నూతన సంవత్సరాది. ఆ మేష విఘవత్ ను నిరయణ రాశిచక్రంలో ప్రారంభ బిందువుగా స్వీకరించి భారత ప్రభుత్వ రాష్ట్రీయ పంచాంగాన్ని రచిస్తున్నారు.
భారత ప్రభుత్వ రాష్ట్రీయ పంచాంగం దృక్సిద్ధాంత పంచాంగం. ఈ పంచాంగాలలో వివిధ ప్రదేశాలకు ప్రతిరోజూ సూర్యోదయ, సూర్యాస్తమయ, చంద్రోదయ, చంద్రాస్తమయ సమయాలు, తిధి, వార, నక్షత్ర, యోగా, కరణం, అంత్య సమయాలు, నక్షత్రకాలం, పట్టణాలకు లగ్న ప్రాంభకాలాలు, వర్జ్యం మొదలైన విషయాలు ఉంటాయి.
వీటితోపాటు లగ్నారంభ సంస్కార పట్టికలు, రవి చంద్రుల నిరయణ భాగల పట్టికలు, గ్రహములు నిరయణ రాశి ప్రవేశములు, గ్రహ వక్రములు, గ్రహోదయ సమయములు, గ్రహణముల వివరాలు, పండుగల వివరాలు రాష్ట్రీయ పంచాంగం ప్రతి సంవత్సరం ప్రచురింపబడుతుంది. న్యూడిల్లీ వారి తరపున కంట్రోలర్ ఆఫ్ పబ్లికేషన్స్ వారు ఈ రాష్ట్రీయ పంచాంగాన్ని ప్రచురిస్తారు.
LIKE US TO FOLLOW: ---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565