MohanPublications Print Books Online store clik Here Devullu.com

వృక్ష సందేశం , Vruksha Sandhesam

వృక్ష సందేశం
 Vruksha Sandhesam
+++++++++++వృక్ష సందేశం ++++++++++
వృక్షం ప్రత్యక్ష దైవం. ‘మహాలక్ష్మమ్మ’ పేరిట ఎన్నో వేపచెట్లు మన ప్రాంతంలో పూజలందుకుంటున్నాయి. అది ఆదిమ ఆచారమైనా, ఆధునిక మానవుడికి సైతం అనుసరణీయమే!
ఆయుర్వేదం ప్రపంచ మానవాళికి భారతదేశం ప్రసాదించిన గొప్ప వరం. మన పరిసరాల్లో ఉండే మొక్కలే వ్యాధులకు మందులని రుషులు కనిపెట్టారు. ఓషధి అంటే మొక్క. ఓషధి నుంచి వచ్చిందే ఔషధం. సృష్టిలో పనికిరాని మొక్క అంటూ లేదు. మొక్కలో పనికిరాని భాగమూ ఉండదు. ఆకులు, పూలు, పండ్లు, కొమ్మలు, రెమ్మలు, మాను, బెరడు, వేళ్లు... అన్నీ ఉపయోగపడేవే! రాలి పడిపోయిన వృక్షభాగాలు ఎండి, మట్టిలో కలిసిభూమిని సారవంతం చేస్తాయి.
ఇనుప ముక్కకు పదునుపెట్టి, పొడవైన కొయ్యకు దాన్ని తగిలిస్తే గొడ్డలి సిద్ధమవుతుంది. ఆ గొడ్డలిని పట్టుకుని మనిషి వృక్షజాతిని ఎడాపెడా నరికి పోగులు పెడుతున్నాడు! మనిషి మరణానంతరం అవే కొయ్యముక్కలు అగ్ని సంస్కారానికి ఉపయోగపడుతున్నాయి. కీడు చేసినవాళ్లకు సైతం మేలు చేసే అత్యుత్తమ సంస్కారం వృక్షానిది.
వృక్ష ప్రాధాన్యం తెలిసిన పూర్వులు నగర నిర్మాణ సమయంలో ఉపవనాలకు కొన్ని ప్రాంతాలు కేటాయించారు. గృహ నిర్మాణం గురించి వివరిస్తూ ఏ దిక్కులో ఏ చెట్లు పెంచాలో చెప్పారు. ఇళ్ల పరిసరాల్లో పూలు, పండ్లు ఇచ్చే చెట్లు శుభప్రదాలు. ఆ చెట్లవల్ల గృహస్థుకు కలిగే లాభాలు ఎన్నో ఉన్నాయి. మామిడి, కొబ్బరి, పనస చెట్లు- సంపదలు సమకూరుస్తాయి. మామిడి చెట్లు ఇంటి చుట్టూ ఏ దిక్కునైనా ఉండవచ్చు. కొబ్బరి మొక్కను తూర్పు, ఈశాన్య దిక్కుల్లో వేయవచ్చు.
బ్రహ్మవైవర్త పురాణాన్ని అనుసరించి, ఎక్కువ భాగం మొక్కలను తూర్పువైపే నాటుకోవాలి. మారేడు, పనస, రేగు చెట్లు పెంచుకుంటే సంతాన లాభం కలుగుతుందన్నది పూర్వుల విశ్వాసం. మామిడి లాగే సంపంగి చెట్టు పెంపకానికీ దిక్కుల నియమం లేదు. శుభప్రదమైన మొక్కలను ఏ వేళనైనా, ఏ దిక్కునైనా వేసి పెంచుకోవచ్చు. చెరకు, పసుపు, శిరీష, కదంబ వృక్షాలు అలాంటివే.
ఆవరణలో గుమ్మడి, దోస, సొర తీగలను పెంచుకుంటే మంచిది. మనం ఉదయమే లేచి చూడదగిన మొక్కలు కొన్ని ఉన్నాయి. తులసి, పొగడ, మల్లె శుభకరమైనవి.
వూళ్లొ ఉండదగినవి కొన్ని ఇళ్లలో ఉండకూడదు. ఉదాహరణకు చింత, వేప వృక్షాలు. వాటి వేళ్లు పెద్దవిగా ఉంటాయి. ఇంటి పునాదులను కదిలిస్తాయి. మర్రి చెట్టూ అలాంటిదే. దీనికి విశాలమైన ప్రాంతం కావాలి. వూరి బయట ఉండదగినది బూరుగు. దీని కాయలు పగిలి, విత్తనాలు మెత్తటి దూది పింజల్లా ఎగిరివచ్చి మనుషులపై పడతాయి. వీటివల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. అందుకే బూరుగును వూరి బయటే పెంచమని పెద్దలు చెబుతారు. పూర్వుల దూరదృష్టి, శాస్త్రీయ దృక్పథాలకు ఇదొక నిదర్శనం.
ప్రాంతీయ అవసరాలు, అభిరుచులనుబట్టి ఏ చెట్టు ఎక్కడ పెంచుకోవాలన్న నియమాలు ఏర్పడతాయి. మానవ జీవితంతో ఇంతగా పెనవేసుకుపోయిన వృక్ష బాంధవ్యాన్ని తెగనరకడం ఆత్మహత్యా సదృశం! వృక్షజాతిని సర్వనాశనం చేస్తున్న మానవాళి, దానివల్ల ఎదురవుతున్న దుష్ఫలితాలను చూసి బెంబేలెత్తుతోంది. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. మంచి పనికి అన్నీ ఉత్తమ ముహూర్తాలే!
తరువులను నాటే తరుణం ఇదే!
మన చేతిలో ఉన్న ఈ పనే పవిత్ర కార్యం.
సామూహిక చైతన్యమే శ్రీరామరక్ష! వృక్షరక్షణే మన తక్షణ కర్తవ్యమని ప్రకృతి మాత పిలుపిస్తోంది!
- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు

LIKE US TO FOLLOW: ---


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list